Industrial Smart City | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పారిశ్రామిక రంగం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి దొందూ దొందే అన్నట్టుగా తయారైంది. ఎవరికివారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తెలంగాణలో పారిశ్రామికరంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిధుల లేమితో రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామికవాడల ఏర్పాటును పూర్తిగా విస్మరించగా.. కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ వ్యవహారమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. తయారీ రంగంలో దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీపీ)ను చేపట్టింది.
ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో ఉండే నగరాలను దశలవారీగా ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో నిరుడు ఆగస్టులో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీలను మంజూరు చేశారు. ఆ జాబితాలో జహీరాబాద్‌కు చోటు కల్పించారు. దీంతో కేంద్రం ఇప్పటివరకు మొత్తం 20 ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీలను మంజూరు చేసినట్టయింది. వాటిలో ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (గుజరాత్), ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ లిమిటెడ్ (మహారాష్ట్ర), గ్రేటర్ నోయిడా ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ (ఉత్తరప్రదేశ్), విక్రమ్ ఉద్యోగ్‌పురి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ (మధ్యప్రదేశ్) ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ 4 గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీలు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల సామర్థ్యాన్ని కలిగివున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం భూములను సమకూర్చితే స్మార్ట్‌సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. తద్వారా నివాస ప్రాంతాలు, కంపెనీల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా మం జూరైన జహీరాబాద్ స్మార్ట్‌సిటీని మొదటి దశలో రూ.2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 1,74,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఆటోమొబైల్, ట్రాన్ప్‌పోర్ట్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్‌తోపాటు మెటల్స్, నాన్-మెటాలిక్ మినరల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలకు అనువుగా ఉండేలా జహీరాబాద్ స్మార్ట్‌సిటీని సిద్ధం చేయాలని నిర్ణయించారు.
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్-జహీరాబాద్ (నిమ్జ్) కోసం జహీరాబాద్, న్యాలకల్, జరాసంఘం మండలాల పరిధిలో 13,500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించగా.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 8 వేల ఎకరాల భూసేకరణ పూర్తయింది. దీనికి పర్యావరణ అనుమతులు కూడా లభ్యమయ్యాయి. కోర్టు కేసుల వల్ల కొన్నిచోట్ల భూసేకరణలో ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని పరిష్కరించాల్సి ఉన్నది. కాగా, స్మార్ట్‌సిటీకి అవసరమైన 3,000 ఎకరాలకుపైగా భూములు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది. సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంఘం మండలాల్లోని 17 గ్రామాల్లో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును మొత్తం రెండు దశల్లో 12,500 ఎకరాలకు విస్తరించాలన్న ప్రతిపాదనలున్నాయి. ఎన్ఐసీడీఐటీ ఫ్రేమ్వర్లో భాగంగా మొదటి దశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభించాల్సి ఉన్నది. అన్ని అనుకూలతలు, భూములు సిద్ధంగా ఉన్నా, కంపెనీల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు.