హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారమైనప్పటికీ.. మార్కెట్లలో మామిడికాయల సరఫరా లేదు. దీంతో మామిడి పండ్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. వేసవి వచ్చిందంటే మార్చి నుంచే మార్కెట్లన్నీ మామిడికాయలతో నిండి ఉండేవి. కానీ, దానికి భిన్నంగా ఈ ఏడాది సీజన్ కనిపిస్తున్నది. సాధారణంగా జనవరిలోనే మామిడికాయలు కాయడం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి మూడో వారం నుంచి మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారమైనా మార్కెట్లోకి నాణ్యమైన మామిడిపండ్లు రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం గత సెప్టెంబర్లో కురిసిన వానలే అని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూతకు వచ్చే ముందు మామిడితోటల్లో బెట్ట వాతావరణం ఉండాలి.
వాస్తవంగా జూన్, జూలైలో వచ్చే వానలతోనే కొత్త చిగుళ్లు వస్తాయి. రెండు నెలల తర్వాత చలి వాతావరణంతో ఆ చిగుళ్లను పూతగా మార్చుకుంటుంది. అప్పుడు కావాల్సిన నీరు పెట్టి ఎరువును వేస్తారు. సాధారణంగా ఆగస్టు నుంచి నీరు పెట్టడం నిలిపివేస్తారు. నవంబర్, డిసెంబర్లో పూత మొదలవుతుంది. ఈసారి భిన్నంగా సెప్టెంబరులో వానలు వచ్చాయి. దీంతో చలి కూడా అంతగా లేకపోవడంతో పూత తగ్గిపోయింది. నవంబర్, డిసెంబర్లో రావాల్సిన పూత కాస్తా.. జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనూ వచ్చింది. దీంతో వేడి ఎక్కువై పూత రాలింది. ఈ ప్రభావం కాతపై పడడంతో మార్కెట్లకు మామిడిపండ్లు రాని పరిస్థితి నెలకొన్నది. ఈ సమయానికి మామిడి రైతులు పండ్ల వ్యాపారంలో బిజీగా ఉండాలి. కానీ, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
మామిడి పండ్ల సంగతి ఇలా ఉంటే.. పచ్చడికాయలు మరింత ప్రియం కానున్నాయి. మార్చిలో పూత రాలిపోవడంతో పచ్చడి మామి డి కాయలు ఆశించిన స్థాయిలో మార్కెట్లోకి రాలేదు. దీంతో ఈ ఏడాది మామిడి పచ్చళ్లు పెట్టుకోవడం కూడా ఆలస్యం కానున్నది.
సాధారణంగా పదేండ్ల వయసు దాటిన మామిడిచెట్టు సీజన్లో 1.20 క్వింటాళ్ల దిగుబడి ఇస్తది. ఎకరానికి 3.5 నుంచి 4 టన్నుల దిగుబడి వస్తుంది. ఏప్రిల్ ఆఖరు, లేదా మే ప్రారంభంలో కాయ కోతకు వస్తుంది. కానీ, ఈ ఏడాది పూత వచ్చే సమయానికి ఎండలు ముదిరాయి. దాంతో పూత రాలి నిరుడితో పోలిస్తే దిగుబడి తగ్గే అవకాశం ఉన్నదని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.