హైదరాబాద్/ఖైరతాబాద్ మే 13 (నమస్తే తెలంగాణ) : నీట్ యూజీ-2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్‌భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బుధవారం నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ పెద్దసంఖ్యలో విద్యార్థులు, నాయకులు లోక్‌భవన్ వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోక్‌భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు, విద్యార్థులకు తోపులాట చోటుచేసుకున్నది. ఈ క్రమంలో విద్యార్థులు, నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ విద్యార్థులపై లాఠీతో విరుచుకపడటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నీట్ యూజీ-2026 నిర్వహణలో కేంద్రం అట్టర్‌ఫ్లాప్ అయిందని విమర్శించారు.
నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ వెంటనే కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏన్డీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్‌సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీతో దేశంలోని దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. లీకేజీ వ్యవహారంలో ఏన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. 2021, 2024ల్లో జరిగిన లీకేజీల నుంచి గుణపాఠం నేర్చుకోలేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేరాఫ్‌గా మారాయని ధ్వజమెత్తారు. కొందరి పెద్దల స్వార్థం కోసం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. 2024లో నీట్ లీకేజీ సందర్భంగా కేంద్రం రాధాకృష్ణన్ కమిటీని నియమించి చేతులు దులుపుకున్నదని దుయ్యబట్టారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా లీకేజీ సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్వీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
నీట్ యూజీ లీకేజీలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ డిమాండ్ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలతో లక్షలాది మంది విద్యార్థుల రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.