న్యూస్‌నెట్‌వర్క్, జూన్ 22 (నమస్తేతెలంగాణ): నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ విద్యార్థిలోకం మండిపడింది. పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్వీ నాయకుడు సదిరం వినయ్‌భాస్కర్, పట్టణ అధ్యక్షుడు దేవోజు హేమంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నీట్ అవకతవకలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ నరసింహారావు ఆధ్వర్యంలో హనుమకొండలోని జూనియర్ కాలేజీ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది సాదిక్ అలీ విద్యార్థులు, సంఘాలతో కలిసి జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పేపర్ లీకేజీ బాధ్యులపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకోకుంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమిస్తారని సాదిక్ అలీ హెచ్చరించారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిని ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూఎన్జీవోస్ కాలనీలోని ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌లో జిల్లా కేంద్రంలో పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.