హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘ప్రధాని మోదీ పదవి నుం చి దిగిపో.. తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పు.. మీ స్వార్థం, మీ లాభం కోసం మా అవకాశాలను అమ్ముకునే హక్కు మీకెవరిచ్చారు? 24 లక్షల మంది విద్యార్థుల ఉసు రు తగులుద్ది.. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి మౌనంగా ఉండటం సిగ్గుచేటు. ప్రతి విద్యార్థి కన్నీటి చుక్కకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి’ అని విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. నీట్ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ నగరంలో విద్యార్థిలోకం కదం తొక్కింది. రాజ్‌భవన్ ముట్టడి, స్టూడెంట్ మార్చ్‌తో నగరం అట్టుడికింది. బీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, విద్యార్థి జనసమితి, డీవైఎఫ్ఐ, పీవైఎల్, ఆమ్ఆద్మీ పార్టీ తదితర 12 విద్యార్థి, యువజన విభాగాలు నిరసన తెలిపాయి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఇతర నేతలు మాట్లాడు తూ నీట్ అవకతవకలపై విరుచుకుపడ్డారు. 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 8,8 50 సీట్లు ఉన్నాయని, 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 9,500 సీట్లున్నాయని, తద్వా రా ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశానికే పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌కు ఒక్క ర్యాంకు కూడా రాకపోవడం విచారకరమని పేర్కొన్నా రు. నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దక్షిణాదిపై వివక్ష చూపుతున్నదని, 150 వైద్య కళాశాలలు కేటాయించగా, అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడంతోనే వివక్ష వెలుగుచూసిందని తెలిపారు. నీట్‌ను ఇప్పటికే తమిళనాడు వ్యతిరేకించిందని, సీఎం రేవంత్ పట్టించుకోవడ మే లేదని, వెంటనే క్యాబినెట్ తీర్మానం చేసి నీట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశా రు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉన్నదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో తుంగబాలు, బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య, కే నితీశ్, విశాల్, లోకేశ్, శ్యామ్, రాహుల్, వంశీ పాల్గొన్నారు.
విచారణ జరపాలి: పీడీఎస్ఎఫ్
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రొగ్రెసివ్ డెమెక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (పీడీఎస్ఎఫ్) రాష్ట్ర నాయకులు నాగరాజు, కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
అట్టుడికిన నగరం
బీఆర్ఎస్వీ, వివిధ విద్యార్థి సంఘా ల ఆధ్వర్యంలో నీట్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ర్యాలీలతో హైదరాబాద్ అట్టుడికింది. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగిన రాజ్‌భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యం లో విద్యార్థులు రాజ్‌భవన్ గేట్లు ఎక్కేందుకు యత్నించారు. పెద్ద సంఖ్యలో రో డ్డుపై బైఠాయించి కేంద్రం వైఖరిని, రా ష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టారు. పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. విద్యార్థులు పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శి స్తూ నినాదాలతో హోరెత్తించారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ తీశారు. పీఎం డౌన్‌డౌన్.. సీఎం డౌన్‌డౌన్ అన్న నినాదాలు మిన్నంటాయి.