న్యూఢిల్లీ, జూలై 29: వైద్య విద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025ను ఆగస్టు 3న ఒకే షిఫ్ట్‌లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. అంతకు ముందు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించిన ఈ పరీక్షలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. అయితే పరీక్ష కే్రందాల కేటాయింపులో నిర్వాహకుల వైఖరి పట్ల అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాము తమ రాష్ట్రంలోని దగ్గర ప్రాంతాలను ప్రాధాన్యతా సెంటరుగా ఎంచుకుంటే తమకు ఇతర రాష్ర్టాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల వేలాది మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అభ్యర్థులకు రాజస్థాన్, ఏపీ అభ్యర్థులకు మధ్యప్రదేశ్, తమిళనాడు అభ్యర్థులకు ఏపీ, కేరళ అభ్యర్థులకు మహారాష్ట్ర, ఇలా ఇష్టం వచ్చినట్టు నిర్వాహకులు సెంటర్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా సెంటర్ల కేటాయింపు
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నిర్వహించే ఈ పరీక్షలను తొలుత జూన్ 15న నిర్వహించాలని అనుకున్నారు. అయితే పరీక్ష పారదర్శకంగా నిర్వహించడానికి ఒక్క షిఫ్ట్‌లోనే దీనిని నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆగస్టు 3కు వాయిదా వేశారు. ఒకే విడత పరీక్షల నిర్వహించాల్సి రావడంతో 2.42 లక్షల మందికి అదనపు పరీక్షా కేంద్రాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎన్బీఈఎంఎస్పై పడింది. దీంతో వారు ఇష్టానుసారంగా తమకు తోచినట్టు ఇతర రాష్ర్టాల్లో సెంటర్లు కేటాయించారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని, తెలియని రాష్ర్టానికి వెళ్లి పరీక్ష రాయడం తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ షాకింగ్ విషయమేమిటంటే వారు రాష్ట్రం పేరుని ఇచ్చారే తప్ప ఏ ఊరో, ఏ కేంద్రమో వివరాలు ఇవ్వలేదు. అలాగే దరఖాస్తు సమయంలో ఇవ్వని ఊర్లను కూడా ప్రస్తుతం కేటాయించారని అభ్యర్థులు తెలిపారు.
ప్రత్యామ్నాయ ఆప్షన్లూ ఇవ్వలేదు
కర్ణాటక వాసి కృపా ఆర్ కుమార్ బెంగళూరు సెంటర్‌గా ఎంచుకుంటే అతడిని ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేటను కేటాయించారు. చాలామంది అభ్యర్థులకు తాము కోరుకున్న సెంటర్‌ను కేటాయించ లేదు. అంతేకాకుండా దరఖాస్తు సమయంలో తమకు ప్రత్యామ్నాయ కేంద్రాల ఆప్షన్ కూడా ఇవ్వకుండా కేవలం ఒక్కటే అడిగారని వారు తెలిపారు. ఇది ఆర్థికంగా భారం కలిగించడమే కాక, ఎంతో ప్రయాస అని శ్రీజా అనే అభ్యర్థిని తెలిపింది. అంత దూరం పరీక్షా కేంద్రానికి వెళ్లాలంటే ఒక రోజు ముందే వెళ్లాలని, టికెట్ల రిజర్వేషన్లు దొరకడం లేదని, అక్కడ ఉండటానికి, లాడ్జీలు కూడా లభ్యం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.