హైదరాబాద్, ముషీరాబాద్, ఆగస్టు 7: నీట్ పరీక్ష దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఈ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రావాలంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘నీట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడం, ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన విద్యార్థుల్లో 8 మంది తొలి ర్యాంకు సాధించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కొందరికి 720 మార్కులకుగాను 718, 719 మార్కులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజే నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. నీట్ పరీక్ష రాసిన దాదా పు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతున్నది. నీట్ కుంభకోణం విషయాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరుపాలి’ అని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృ ష్ణ, నీల వెంకటేశ్, అనంతయ్య, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.