హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): వైద్యవిద్యలో నీట్ పరీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. నీట్ వల్ల తెలంగాణతోపాటు చాలా రాష్ర్టాలు నష్టపోతున్నాయని, వైద్యవిద్య ప్రవేశాలను ఆయా రాష్ట్రాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. బీహార్, గుజరాత్ రాష్ర్టాల నుంచి నీట్ ప్రశ్నపత్రం లీకై, కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తుంటే ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లోని మెడికల్ పీజీ సీట్లలో 50% సీట్లు ‘ఆల్ ఇండియా’ కోటా కిందకి వస్తాయని, దీంతో మన రాష్ట్ర వైద్య విద్యార్థులు 621 సీట్లు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లడం వల్ల మన రాష్ట్ర విద్యార్థులు 519 సీట్లు కోల్పోతున్నారని చెప్పారు.
తెలంగాణలో ఎకువ ప్రభుత్వ కాలేజీలు ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆల్ ఇండియా కోటా కింద ఎకువ సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారని వివరించారు. ప్రభుత్వ కళాశాలను మాత్రమే ఆల్ ఇండియా కోటా పరిధిలోకి తేవడం వల్ల ఎకువ నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఒకసారి తెలంగాణలో ఎంబీబీఎస్‌లో చేరితే, వారు పీజీ చేసేందుకు స్థానికులుగా అర్హత సాధిస్తున్నారని తెలిపారు. కానీ, తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివితే, అకడ నాన్ లోకల్‌గా, ఇకడ కూడా నాన్‌లోకల్‌గా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో మన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌తోనే చదువుకు ఫుల్స్టాప్ పెడుతున్నారని పేర్కొన్నారు.
పరీక్ష నిర్వహణలో ప్రభుత్వాలు విఫలం
నీట్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని, ఈసారి ఏకంగా 67 మంది టాపర్లుగా నిలవడమే అనుమానాలను బలపరుస్తున్నదని వినోద్‌కుమార్ చెప్పారు. కొన్నిచోట్ల ఇంగ్లిష్ పేపర్‌కు బదులు హిందీ పేపర్ ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయని, తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దేశంలో అందరికీ ఇచ్చిన పేపర్ కాకుండా వేరే ప్రశ్నాపత్రం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయని తెలిపారు. ఇది ని జంగా దారుణమని, పరీక్ష నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఆలస్యంగా ప్రశ్నపత్రాలు ఇవ్వడం వల్ల కొంతమందికి గ్రేస్ మారులు కలిపామని, దానివల్ల 718, 719 మారులు వచ్చాయని ఎన్టీఏ డైరెక్టర్ చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కోర్టులో కేసు వేయగానే గ్రేస్ మారులను తీసేశారని, అసలు గ్రేస్ మా రులు ఏ లెకన కలిపారు? ఎందుకు కలిపా రు? ఎంతమందికి కలిపారు? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉన్నదని మండిపడ్డారు. ఒకవైపు నీట్లో తప్పులు జరిగాయని, బాధ్యులపై చర్య లు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్తుండగా పరీక్షను రద్దు చేయకుండా కౌన్సెలింగ్ నిర్వహించడంలో అర్థం ఏమిటని నిలదీశారు. ఇంత జరుగుతున్నా వై ద్యవిద్యను పర్యవేక్షించే కేంద్ర వైద్యశాఖ మం త్రి స్పందించకపోవడం విడ్డూరమన్నారు.
ముందే ఎందుకు విడుదల చేశారు?
నీట్ ఫలితాలు జూన్ 14న విడుదల చేస్తామని మొదట ఎన్టీఏ ప్రకటించిందని, కానీ, దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన జూన్ 4న హడావుడిగా ఎవరికీ తెలియకుండా విడుదల చేశారని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తప్పులు జరిగాయి కాబట్టే ఆ రోజు ఎవరూ పట్టించుకోరని ఫలితాలను విడుదల చేశారనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. ‘పరీక్షా పే చర్చ’ అంటూ హడావుడి చేసే ప్రధాని మోదీ ఇప్పుడు కనీసం స్పందించడం లేదని విమర్శించారు. నాడు టీఎస్పీఎస్సీ లీకులపై గాయి గత్తర చేసిన బీజేపీ నాయకులకు ఇప్పుడు నీట్ వ్యవహారం కనిపించడం లేదా? నీట్లో ఉత్తరాది వాళ్లకే ఎందుకు ఎకువ సీట్లు వస్తున్నాయి? వాళ్ల లబ్ధి కోసమే నీట్‌ను నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని లక్షలాది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత చేసేదేమీ ఉండదని, ఇప్పుడే ఈ పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి న అవసరం ఉన్నదని చెప్పారు. సమావేశం లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, పార్టీ సీనియర్ నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.