NDSA | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. పిల్లర్ కుంగడానికి స్పష్టమైన కారణాలను తెలపకుండా, సూచనలు చేయకుండా, ఊహాజనితమైన, అసంబద్ధమైన అంశాలనే ప్రస్తావించిందని కొట్టిపడేస్తున్నారు.
మరమ్మతు పనులకు తాము ఎప్పుడో సూచించిన అంశాలనే మార్గదర్శకాల పేరిట జారీ చేశారు తప్ప అందులో కొత్తగా ఏమీ లేదని విమర్శిస్తున్నారు. అదీగాక విలువైన సమయాన్ని వృథా చేశారని, వర్ష్షాకాలం సమీపిస్తున్న తరుణంలో నివేదిక విడుదల చేసి మరికొన్ని పరీక్షలను నిర్వహించాలని, పనులను పూర్తి చేయాలని ఆదేశించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 20 పిల్లర్ కుంగుబాటునకు గురైన వెంటనే రెండు రోజుల్లోనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ అధికారుల బృందం రాష్ర్టానికి విచ్చేసింది.
వారం తిరగకముందే, ఎలాంటి పరీక్షలను నిర్వహించకుండానే బరాజ్ కుంగుబాటుకు అనేక ఊహాజనిత కారణాలను విశ్లేషిస్తూ నివేదికను విడుదల చేసింది. మళ్లీ ఈ ఏడాది మార్చి వరకు బరాజ్ ఊసెత్తలేదు. అటు తర్వాత ఎట్టకేలకు బరాజ్ కుంగుబాటుకు కారణాలను అధ్యయనం చేసి, పునరుద్ధరణ చర్యలను సిఫారసు చేసేందుకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ 2024 మార్చిలో రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీల నుంచి వివరాలను సేకరించింది. నిపుణుల కమిటీకి రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పలు అంశాలను వివరించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తాజాగా 378పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇందులోని సిఫారసులు అన్నీ కూడా గతంలో జారీ మార్గదర్శకాలే కావడం ఇక్కడ గమనార్హం. మేడిగడ్డ బరాజ్‌లోని 85 రేడియల్ గేట్లలో 77 గేట్లు యథావిధిగా పనిచేస్తున్నాయని అనాడే తేల్చిచెప్పింది. తాజాగా కుంగుబాటునకు గురైన 7వ బ్లాక్ మొత్తాన్ని తొలగించాలని వెల్లడించింది. తాజా రిపోర్టులోనూ మళ్లీ అవే అంశాలనే కాస్త వివరణాత్మకంగా, సాంకేతిక పదజాలంతో ఎన్డీఎస్ఏ నివేదించిందే తప్ప మరేమీలేదని నిపుణులు చెప్తున్నారు. అదీగాక అండర్పైపింగ్ జరగడం వల్లే పిల్లర్ కుంగుబాటుకు గురైందని తాము మొదటి నుంచీ చెప్తున్నామని, అదే విషయాన్ని ఇప్పుడు ఎన్డీఎస్ఏ నిర్ధారించిందని వివరిస్తున్నారు. ఎక్కడా స్పష్టమైన కారణాలను వివరించకుండా, సూచనలు చేయకుండా ఊహాజనిత అంశాలతోనే రిపోర్టును వండివార్చిందని ఇరిగేషన్‌శాఖ అధికారులు మండిపడుతున్నారు.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎన్డీఎస్ఏ నిపుణులు కమిటీ పలు ఆరోపణలు చేసిందని రాష్ట్ర ఇంజినీర్లు విమర్శిస్తున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్‌ను మార్చారని, ఎలాంటి ఇన్వేస్టిగేషన్ చేయలేదని తెలపడం సరికాదని వివరిస్తున్నారు. బ్యారేజీల నిర్మాణ స్థలం మార్చిన మాట వాస్తవమేనని, అలాంటి మార్పులు కొత్తదేమీ కాదని, రకరకాల కారణాల వల్ల నిర్మాణ స్థలాన్ని మార్చే పరిస్థితులు ఏర్పడడం సహజమని ఇంజినీర్లు చెప్తున్నారు.
స్థలం మార్చినా కూడా భూభౌతిక పరిశోధనలు లేకుండా బరాజ్‌లను నిర్మించారనేది పూర్తిగా అవాస్తవమని ఇంజినీర్లు కొట్టిపడేస్తున్నారు. భూభౌతిక పరిశోధనలు చేసి వాటి ఫలితాలను సీడీవోకి పంపించారని, డిజైన్లను తీసుకున్నారని నొక్కిచెబుతున్నారు. ఆ డిజైన్లను కూడా ‘డిజైన్ ఆఫ్ బరాజ్ ఆన్ పర్మియబుల్ ఫౌండేషన్’పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ), సీడబ్ల్యూసీ జారీ చేసిన డిజైన్ మాన్యువల్లు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జారీ చేసిన కోడ్స్‌ను తూచా తప్పకుండా పాటించి, డిజైన్లను రూపొందించారని వివరిస్తున్నారు.
దేశంలో ఎవరైనా వాటి ఆధారంగానే బరాజ్‌ల డిజైన్లు రూపొందిస్తారని, మరి భూభౌతిక పరిశోధనలు జరపలేదని ఏ ఆధారాలతో ఎన్డీఎస్ఏ తెలిపిందో అర్థంకానీ విషయమని, ఇది తెలంగాణ ఇంజినీర్ల ఇంజినీరింగ్ పరిజ్ఞానం, సమగ్రతను అపహాస్యాం చేయడమేనని రాష్ట్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బరాజ్‌ల నిర్మాణానికి ముందు తెలంగాణ ఇంజినీరింగ్ రీసర్చ్ ల్యాబొరేటరీస్ (టీఎస్ఈఆర్ఎల్) ద్వారా మోడల్ స్టడీస్ చేయించలేదని, ల్యాబ్స్‌లో అధ్యయనాలను చేసేందుకు వసతులు లేవనడం కూడా నిరాధారమైన ఆరోపణనేనని వివరించారు.
నిజాం జమానాలో స్థాపించిన ఆ ల్యాబ్‌లో అన్ని వసతులు, పరికరాలు ఉన్నాయని, 3 బరాజ్‌లపై 2డీ మోడల్ స్టడీస్ నిర్వహించారని వాటి ఫలితాల ఆధారంగా బరాజ్‌ల వెంట్వే పెంచడమేగాక, నిర్మాణాన్ని పర్యవేక్షించారని ఇంజినీర్లు వివరిస్తున్నారు. సూచనలు ఏమీ చేయకుండా ఆరోపణలు చేస్తూ, అసంబద్ధమైన అంశాలతో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందే తప్ప మరేమీ కొత్తదనం లేదని మండిపడుతున్నారు.
ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికపై రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ మాత్రం రిపోర్ట్ ఇవ్వడానికి ఏడాదిన్నర తీసుకోవాల్సిన అవసరంలేదని చెప్తున్నారు. తాము సూచించిన రక్షణ చర్యలనే ఎన్డీఎస్ఏ తిరిగి తమకు పంపించిందని, అంతకుముంచి ఏమీలేదని మండిపడుతున్నారు. ఈ మాత్రందానికి విలువైన సమయాన్ని వృథా చేసిందని ఇంజినీర్లు విమర్శిస్తున్నారు. మేడిగడ్డ 7బ్లాక్ తరహాలోనే మిగతా బ్లాకుల్లో కూడా నిర్మాణ లోపాలు, సొరంగాలు, కటాఫ్ వాల్స్‌లో రంధ్రాలు ఉండవచ్చు..? అంటూ ఊహగానాలు చేయడమేకాగా, బరాజ్ మొత్తానికి ఇన్వేస్టిగేషన్ చేయాలని సూచించడం హాస్యాస్పదని వివరిస్తున్నారు.
గతంలో పరీక్షలను నిర్వహించిన సమయంలోనే మిగతా బ్లాకుల్లో ఎలాంటి సమస్యాలేదని తేలిపోయిందని ఇంజినీర్లు గుర్తుచేస్తున్నారు. 2024లో వరదలు కూడా సాక్ష్యమని ఉదహరిస్తున్నారు. 15 లక్షల క్యూసెకుల వరదను బరాజ్‌లు సురక్షితంగా ఎటువంటి అదనపు డ్యామేజీలు లేకుండా కిందకు పంపించాయని, ఎన్డీఎస్ఏ ఊహలే నిజమైతే, ప్రమాదాలు సంభవించి ఉండేవని, కానీ అలాంటివేమీ జరగలేదని చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 3 బరాజ్‌లలోని అన్ని బ్లాకుల్లో జీయోలాజికల్, జియోఫిజికల్ ఇన్వేస్టిగేషన్ చేసి వాటి ఫలితాల ఆధారంగా పునర్నార్మాణ డిజైన్లు రూపొందిచుకోవాలంటే కనీసం మూడు, నాలుగు పంటకాలాలు నష్టపోయినట్టేనని వివరిస్తున్నారు.
జూన్ రెండో వారానికల్లా గోదావరిలో ప్రవాహాలు పెరుగుతాయని, నవంబర్ వరకు కొనసాగుతాయి కాబట్టి 2025లో పరీక్షల నిర్వహణ అసాధ్యమని, 2026 జనవరిలో మాత్రమే పరిశోధనలు ప్రారంభించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. మొత్తం బ్యారేజీ అంతా పరిశోధించాలంటే మరింత సమయం పడుతుందని తెలిపారు. ఎన్డీఎస్ఏ విలువైన సమయాన్ని వృథా చేసిందని ఇరిగేషన్ అధికారులు విమర్శిస్తున్నారు.