హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల సమర్పించిన నివేదికపై క్యాబినెట్లో చర్చిస్తామని, ఆ తరువాతే తదుపరి చర్యలపై ముందుకు వెళ్తామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవలనే 378 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఎస్ఏ నివేదిక అనేక అంశాలను, బరాజ్‌లకు సంబంధించిన నిర్మాణ లోపాలను వెల్లడించిందని తెలిపారు. నివేదికను అనుసరించి బరాజ్‌లను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు.
నివేదికపై మంత్రిమండలిలో చర్చిస్తామని, సాంకేతిక నిపుణులను సంప్రదించి బరాజ్‌ల పునరుద్ధరణకు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. మేడిగడ్డ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, దానిపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వాటర్ మేనేజ్మెంట్, ల్యాండ్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(వాలంతరి) సాంకేతిక శిక్షణ సంస్థను బలోపేతం చేసి ఇంజినీర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. తమ్మిడిహెట్టిని ఆధారం చేసుకుని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించే అంశంపై నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో మం త్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.