Kaleshwaram Project | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ మరమ్మతులకు సంబంధించిన ప్రక్రియ ఆలస్యంగా కొనసాగడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్‌జైన్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. పనుల జాప్యానికి కారణమేంటని ప్రాజెక్టు అధికారులను నిలదీశారు. రిపోర్టు వచ్చి ఏడాది గడచినా టెస్టులు పూర్తి చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
సౌత్ రీజినల్ స్టేట్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్‌కు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్.. ఆ తరువాత రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారని సమాచారం. ఈ సందర్భంగా మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులపై సమీక్షించినట్టు తెలిసింది. ఆయా బరాజ్‌లకు సంబంధించి ఎన్డీఎస్ఏ బృందం తన నివేదికను గత ఏప్రిల్‌లోనే అందజేసింది. పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు వీలుగా తొలుత పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఆ నివేదికలను సీడబ్ల్యూసీకి పంపి, డిజైన్లు రూపొందించుకుని, ఆ మేరకు బరాజ్ పునరుద్ధరణ పనులు నిర్వహించాలని ఎన్డీఎస్ఏ గతంలోనే స్పష్టం చేసింది.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ ఎన్డీఎస్ఏ సూచనల మేరకు టెస్టులు పూర్తి చేయలేదు. తాజా భేటీలో ఇదే విషయమై కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్ నిలదీశారు. రిపోర్ట్ ఇచ్చి ఏడాది దాటిపోతున్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వానకాలం వచ్చేలోగానైనా టెస్టులు పూర్తవుతాయా? అని అనుమానం వ్యక్తంచేశారు. డిజైన్స్ టీం, ఇన్వెస్టిగేషన్స్ టీం సమన్వయంతో ముందుకు వెళ్లాలని, వీలైనంత త్వరగా టెస్టులను పూర్తి చేసి డిజైన్లను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే రిపోర్ట్ వచ్చేనాటికే వానకాలం వచ్చేసిందని, ఫలితంగానే పరీక్షలు సాధ్యపడలేదని, గత జనవరి నుంచి టెస్టులు ప్రారంభమయ్యాయని, 2-డీ మాడ ల్ స్టడీస్ వంటివి చేస్తున్నామని, సీడబ్ల్యూపీఆర్ఎస్ సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. టెస్టుల విషయంలో తమకు ఓ రోడ్ మ్యాప్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా పనులు చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలుపగా, అందుకు ఎన్డీఎస్ఏ చైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఎన్డీఎస్ఏ బృందం శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శిస్తుందని సమాచారం.