హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): నిర్దేశించిన పరీక్షల నివేదికలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తేనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు తదుపరి చేపట్టాల్సిన చర్యలు, సిఫారసులకు సంబంధించి తుది నివేదికను ఇస్తామని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మరోసారి స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత రిపోర్టులను ఇవ్వకపోవడం వల్లే తుది నివేదిక సమర్పణకు జాప్యమవుతున్నదని పేర్కొన్నది. ఇప్పటికైనా తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ డైరెక్టర్ అజయ్‌కుమార్ సిన్హా తాజాగా మరోసారి లేఖ రాశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించిన నిర్మాణ లోపాలపై అధ్యయనం చేసి, వాటి నివారణకు సంబంధించి తగు సూచనలు చేసేందుకు ఎన్డీఎస్ఏ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ గతంలోనే క్షేత్రస్థాయిలో సందర్శించి రాష్ట్ర అధికారులకు పలు సూచనలు చేసింది. నాణ్యత, డిజైన్, భూ భౌగోళిక పరిస్థితులు, వరద ప్రవాహాల స్థితిగతులు తదితర అంశాలకు సంబంధించిన పరీక్షలను సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్ వంటి సంస్థలో చేయించాలని, అందుకు సంబంధించిన నివేదికలను అందజేయాలని సూచిస్తూ మధ్యంతర నివేదికను అందజేసింది.
ఆ నివేదికను సమర్పిస్తే, వాటిని అధ్యయనం చేసి తుది నివేదికను సమర్పిస్తామని ఎన్డీఎస్ఏ గతంలోనే వెల్లడించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ రిపోర్టులను సమర్పించలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ పాలసీ, రీసెర్చ్ వింగ్ డైరెక్టర్ అజయ్‌కుమార్ సిన్హా ఇటీవల ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖను రాశారు. నిర్దేశిత పరీక్షల రిపోర్టులను సమర్పించేలా తెలంగాణ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాగు నీటి పారుదల శాఖ సెక్రటరీకి సైతం లేఖ రాశారు.