హైదరాబాద్, నవంబర్ 8 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకొందా? అందుకే, తొలి దఫా పోలింగ్ ముగియగానే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసిందా? జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఇది నిజమేననిపిస్తున్నది. గురువారం జరిగిన తొలి దఫా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 64.66 శాతం పోలింగ్ నమోదైంది.
రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో పోలింగ్ నమోదుకావడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే, అది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో కమలదళం అలర్టయినట్టు తెలుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శుక్ర, శనివారాల్లో బీజేపీ నేతలు ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
కళ్యాణ్పూర్, మధుబన్, బహదూర్‌గంజ్, బల్రామ్పూర్ తదితర నియోజకవర్గాల్లో ఆదివారం ప్రచార సభలను పెంచినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా శుక్ర, శనివారాల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడటం కూడా తొలి దఫా పోలింగ్ ఫలితమేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి.