ముంబై: బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్ధ్ పవార్‌కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజస్‌కు ప్రభుత్వం రూ.300 కోట్లకే విక్రయించినట్టు తీవ్ర ఆరోపణలు రాగా, ప్రస్తుతం మీరా భయందర్‌లోని రూ.200 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ తన సొంత విద్యాసంస్థ కోసం 3 కోట్లకే ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందారని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడేట్టివార్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ భూమి మార్కెట్ విలువ రూ.400 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ కేటాయింపు ప్రధాన నగరాల్లో బిల్డర్లు, డెవలపర్లు, రాజకీయ నేతల అక్రమ చర్యలకు దారితీస్తుందని, వారు కూడా ఇదే మార్గంలో అక్రమ మార్గాల ద్వారా భూమిని పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘మీరు భూమిని దోచుకోవాలనుకుంటున్నారు.. మేము కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు’ అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక మంత్రి ఇలా తన సొంత విద్యాసంస్థల కోసం ఇలా భూమిని కారు చవకగా పొందవచ్చా? ఇది అనుమతించదగినదే అయితే ఇది అలాగే ఉండనివ్వండి.. మేము కళ్లు మూసుకుంటాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు కేటాయించిన పుణె భూ కుంభకోణానికి సంబంధించి చట్ట ప్రకారమే విచారణ సాగుతుందని, ఈ విషయంలో ఎవరినీ రక్షించే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పష్టం చేశారు.