న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశీయ మార్కెట్లోకి మరో లగ్జరీ ఈవీ కారు అందుబాటులోకి వచ్చింది. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన మినీ ఇండియా మరో మాడల్‌ను పరిచయం చేసింది. మినీ కంట్రీమ్యాన్ ఎస్ఈ పేరుతో విడుదల చేసిన ఈ కారు ధర రూ.66 లక్షలు. 313 హెచ్‌పీ శక్తి కలిగిన ఈ మాడల్‌ను డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటర్స్‌తో తీర్చిదిద్దినట్టు కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. ఈ ధర న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. రెండు రంగుల్లో లభించనున్న ఈ కారు డోర్లను స్మార్ట్‌ఫోన్‌తో తెరిచేవిధంగా డిజైన్ చేసింది.
మిగతా ఫీచర్లలో భాగంగా నావిగేషన్, రిమోట్ సర్వీసెస్, రిమోట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్స్, యాపిల్ కార్ప్లే, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్, మూడు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రాష్ సెన్సార్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 180 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 66.45 కిలోవాట్ల కెపాసిటీ కలిగిన బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 440 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 29 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జి కానున్నది. ఈ కారు బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీని ఇస్తున్నది.