హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి, ఆర్థికంగా మత్స్యకారుల బలోపేతానికి రూ.1,000 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) సంసిద్ధతను వ్యక్తం చేసిందని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, వైస్ చైర్మన్ దీటి మల్లయ్య వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని ఎన్సీడీసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ పిైళ్లె, డిప్యూటీ డైరెక్టర్ పాటిల్ నీలేశ్ సురేశ్‌తో సమావేశమై చర్చించారు.
రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ అమలు చేసిన ‘సమీకృత మత్స్య అభివృద్ధి పథకం’ ఉత్తమమైన ఫలితాలను సాధించినందుకు తమ సంస్థ ద్వారా మరో రూ.వెయ్యి కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎన్సీడీసీ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే రుణ సదుపాయాన్ని అందిస్తామని చెప్పారని చైర్మన్, వైస్ చైర్మన్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పూర్తిస్థాయి ప్రతిపాదనలను సిద్ధం చేసి అందజేస్తామని ఎన్సీడీసీ అధికారులకు తాము చెప్పినట్టు వారు వివరించారు.