Elkathurthi Sabha | వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రకృతి పూర్తిగా అనుకూలించింది. ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన దానికంటే రెట్టింపు స్థాయిలో జనం వచ్చారు. అనుకూల వాతావరణం నెలకొనడంతో ఆ లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. మహిళలు కూడా అనుకున్న దాని కంటే భారీ స్థాయిలో సభకు రావడానికి అనుకూల వాతావరణమే ప్రధాన కారణంగా కనిపించింది. మహాసభకు ఒక్కరోజు ముందు నుంచే ఎండాకాలం చల్లగా మారుతూ వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి పూర్తిగా చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా మబ్బులు చల్లబడ్డాయి.
మధ్యాహ్నం నుంచి వాతావరణం పూర్తిగా చల్లగా మారింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సభకు వచ్చే జనం ఉత్సాహంగా తరలివచ్చారు. ఏప్రిల్ నెలలో తీవ్రమైన ఎండలు ఉంటాయి. ఆ మేరకు శుక్రవారం 42 డిగ్రీలు, శనివారం 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రత నమోదైంది. బీఆర్ఎస్ సభ జరిగిన రోజైన ఆదివారం అనుకూల వాతావరణం నెలకొన్నది. మధ్యాహ్నం వరకు 35 డిగ్రీలకు ఉష్ణోగ్రత తగ్గింది. బహిరంగసభకు గంట ముందు ఏకంగా 31 డిగ్రీలకు దిగింది. ఎల్కతుర్తికి సమీపంలోని వరంగల్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో అయితే శనివారం రాత్రి నుంచే వాతావరణం పూర్తిగా చల్లబడింది. కొన్ని గ్రామాల్లో చిరుజల్లులు కురిశాయి. ఈ మహాసభకు ఆహ్వానం అన్నట్టుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తాజా వాతావరణం ఉపశమనం కలిగించింది. అందుకే తండోపతండాలుగా జనం ఎల్కతుర్తికి వెల్లువలా తరలివచ్చారు.