హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29: ఓసీలను అణగదొక్కిందే రేవంత్‌రెడ్డి( CM Revanth Reddy )అని వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాటుపల్లి వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 28 కొడంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వెలమలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, వెలమజాతిని కించపరిచేవిధంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి వెంటనే తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక బాధ్యత గల పదవీలోఉన్న రేవంత్‌రెడ్డి కొడంగల్ సభలో వ్యక్తిగతకక్షతో అహంకారపూరితంగా వెలమలను కించపరిచేవిధంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. వెలమ జాతి మొత్తాన్ని తెచ్చుకోండి అనే పద్ధతిలో కక్షతో వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని, రేవంత్‌రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే పెద్దఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాకులమర్రి ప్రవీణ్‌రావు, సభ్యులు సిద్దూర్ స్వామిరావు, పల్లెపాడు విద్యాసాగర్‌రావు, లింగంపల్లి పాపారావు, తక్కలపల్లి అమృతరావు, గుజ్జ గోపాల్‌రావు, తక్కలపల్లి బలరాంరావు పాల్గొన్నారు.