హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అధిక ఫీజుల వసూలుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. నిర్దేశిత ఫీజుల కన్నా అధికంగా వసూలు చేసిన కాలేజీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో అధిక ఫీజుల వసూళ్లపై కొందరు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. జేబీఐఈటీ సహా మరికొన్ని అటానమస్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే రాష్ట్రంలో పర్యటించిన కమిషన్, అధికారులను విచారించింది. సదరు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్టులో పెట్టాలని సర్కారుతోపాటు వర్సిటీలకు ఆదేశాలిచ్చింది.
జేఎన్టీయూ రిజిస్ట్రార్ శనివారం సర్క్యులర్ జారీచేశారు. అధిక ఫీజులు వసూలుచేస్తే కాలేజీలను బ్లాక్‌లిస్టులో పెడతామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ స్కూల్స్ అండ్ టెక్నికల్ కాలేజీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ స్వాగతించారు. ఫీజులు దండుకుంటున్న కాలేజీలు ఉద్యోగులు, అధ్యాపకులకు వేతనాలివ్వడంలేదని, దీనిపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.