Lagacharla | మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొడంగల్, నవంబర్ 18: ‘అద్దమ్మ రేత్రి యమునోళ్లొచ్చినట్టు వచ్చిర్రు.. మగపురుగు లేకుండ ఎత్తకపోయిర్రు.. ఆళ్ల జాడ ఎక్కడో తెల్వదు.. అసలు బతికే ఉన్నర? లేదా అని గుబులైతుంది.. అప్పటి నుంచి పిల్లాజెల్ల, ముసలి ముతక అందరికీ ఆకలి దప్పులు కరువైనయ్! రాత్రయితే నిద్రనేదే దూరమైంది.. పోలీసులు వస్తుర్రు అంటే గుండెల్ల గుబులు పుడుతుంది.. ఊళ్లె నించి ఒక్కలు కూడా పనులకే పోతలే.. పిల్లలెవరూ బడికి పోతలే.. బువ్వబెట్టే భూములియ్యమన్నందుకే మాకీ గతి.. మళ్ల మావోళ్లు (మొగోళ్లు) ఊళ్లెకొస్తెనే మా బాధ తీరుద్ది.. అప్పటిదాకా మాకిదే గతి.. ఎట్టయినా మావోళ్లని రప్పియుర్రి సారూ’ అంటూ సోమవారం పర్యటించిన ఎస్టీ జాతీయ కమిషన్ బృందం ఎదుట లగచర్ల, రోటిబండ తండ సమీప గ్రామాల బాధిత కుటుంబాలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కన్నీటి పర్యంతమై వారి కాళ్లపై బడి తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. లగచర్ల ఘటనపై తీవ్రంగా స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ బృందం సోమవారం లగచర్ల, రోటిబండ తండాలో పర్యటించింది. మధ్యాహ్నం ఒకటిన్నరకు రోటిబండ తండాకు చేరుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌ను చూడగానే కట్టలు తెంచుకున్న దుఃఖంతో ఆయన కాళ్లపై బడ్డారు.
మమ్మల్ని బతకనీయండి.. అంటూ వేడుకున్నారు. దీంతో చలించిన ఆయన గిరిజనులతోపాటు నేలపైనే కూర్చొని వారి సమస్యలను సావధానంగా విన్నారు. ‘డబ్బుతో కాదు సెంటిమెంట్‌తో కూడుకొంది మా పోరాటం.. మా ఇష్టాలను గ్రహించాలి.. బలవంతంగా భూ సేకరణ చేపట్టవద్దు’ అంటూ వేడుకున్నారు. అన్యాయంగా భూములు లాక్కొవాలని చూస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలానా కంపెనీ ఏర్పాటు చేస్తామంటూ ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అంటూ నిలదీశారు. దీంతో చలించిన కమిషన్ సభ్యుడు.. ఎస్పీ నారాయణరెడ్డిని నిలదీశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని, అరెస్టులను వెంటనే ఆపాలని, ఇప్పటికే అరెస్టు అయిన వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రమేయం లేకపోతే విడుదల చేయాలని ఆదేశించారు. లగచర్లలో జరిగిన ఘటనపై డీజీపీ, సీఎస్‌లు నివేదిక ఇవ్వాలని కోరుతామని మీడియా ఎదుట ఆదేశించారు. ఇక మీదట ఏంచేసినా కమిషన్‌కు పూర్తి నివేదిక ఇచ్చాకే చర్యలు తీసుకోవాలని పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
మా సమాధుల మీద శంకుస్థాపన చేయ్..
‘మేము భూములపైనే ఆధారపడినం, అవేపోతే మా బతుకులు ఆగమైతయ్, సర్కారు భూములు లాక్కొని ఉద్యోగాలు, ఇంటిస్థలంతోపాటు రూ.10 లక్షలు ఇస్తామంటుంది. మాకు సదువులే లేవు.. ఏం ఉద్యోగాలు ఇస్తరు, ఏవిధంగా బతకాలి.. అని బాధిత గ్రామాల ప్రజలు కమిషన్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టుదలకు పోతే మేము సచ్చాక మా సమాదుల మీద శంకుస్థాపన చేయండి’ అంటూ కమిషన్ ముందు గోసరిల్లారు. ‘సంఘటన స్థలంలో లేని వాళ్లను సైతం పోలీసులు ఎత్తుకెళ్లిండ్రు.. కొంత మంది భయానికి తండాలు వదిలిపోయిండ్రు. ఏం జరిగినా మా భూముల్ని మాత్రం వదులుకోం.. అరెస్టు చేసిన మా మొగోళ్లను ఇడిచి పెట్టండి’ అని వేడుకున్నారు. భూములు పోతయనే బాధతో తిండి, నిద్ర లేకుండా గడుపుతున్నం.. మా భూములు ఇవ్వబోమని కలెక్టర్‌కు, తాసిల్దార్‌కు, ఆర్డీవోను కలిసి చెప్పుకున్నం. ఇవ్వాల్సిందేనని మీటింగులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసిర్రు.. అని చెప్పారు.
కలెక్టర్ అని మాకు తెలవదు
లగచర్లలో గొడవైన రోజు వచ్చింది కలెక్టర్ అని మాకు తెల్వనే తెల్వదు. ఆ తర్వాత అర్ధరాత్రి లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో పోలీసులు ఇండ్లలోకి చొరబడి కనిపించినోళ్లను కనిపించినట్టు మొగోళ్లందరినీ లాక్కొనిపోయిర్రు. కొంతమంది ఎక్కడ మమ్మల్ని పోలీసులు తీసుకుపోతారో అన్న భయంతో పారిపోయిర్రు. ఇప్పుడు ఆడోళ్లం మాత్రమే మిగిలినం. మమ్మల్ని కూడా ఆడ పోలీసులతో తీసుకొచ్చి తన్ని తీసుకుపోతమంటూ బెదిరిస్తుర్రు. అందుకే మేమంతా రాత్రి కాగానే పొలాలు, గట్టులెంట పడుకుంటున్నాం.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి.. ఊరి నుంచి పోయిన మొగోళ్లు ఏడ ఉన్నరో? ఏం చేస్తున్నరో? తింటున్నరా? పస్తులున్నరా? బతికే ఉన్నరా? చనిపోయిర్రా? కూడా తెలియాలంటూ భోరున విలపిస్తూ కమిషన్ వద్ద వేడుకున్నారు. వాళ్ల కోసం మేమంతా తిండిమాని పిల్లలను బడికి ఊడా పంపకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.. అని కమిషన్ సభ్యుడి ముందు వాపోయారు.
ఆడోళ్ల మీద దౌర్జన్యం
ఆడవాళ్లు అని కూడా చూడకుండా పోలీసులు మద్యం మత్తులో మా పైన చెప్పుకోలేనంతగా ప్రవర్తించారని బాధిత మహిళలు కమిషన్‌కు గోడు వెళ్లబోసుక్నురు. ఆరోపించారు. అర్ధరాత్రి వచ్చిన పోలీసులు మీ మొగోళ్లు.. ఏడున్నరంటూ మాపై చేయి వేసి ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ తడిమారని బావురుమన్నారు. మేమేం పాపం చేశామని రాత్రిపూట వచ్చారు. పోలీసులకు ఇది తగునా? అని ప్రశ్నించారు. మేం ఓట్లేస్తేనే రేవంత్ సీఎం అయ్యిండు.. మమ్మల్ని అడిగేది ఉండె.. మాతోనికి వచ్చేది ఉండే.. అంటూ వాపోయారు.
పోలీసుల పహారాలో లగచర్ల
జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో వికారాబాద్, పరిగి, కొడంగల్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నుంచే నాకాబంది ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం నుంచి ఆ తండాలకు వెళ్లే రహదారులు మొత్తం దిగ్బంధించారు. దాదాపు 1,000 మంది పోలీసులు వాహనాల్లో గస్తీ తిరుగుతూ భయాందోళన సృష్టించారు. దీంతో లగచర్ల గ్రామంలో కమిషన్ బృందం ముందు ముగ్గురు, నలుగురు మినహా ఎవరూ ముందుకురాలేదు. లగచర్ల వైపు వెళ్లే రహదారులను నిర్బంధించారు. గ్రామాలు, తండాల్లోనూ మఫ్టీల్లో పోలీసులు తిరిగారు. కమిషన్ బృందం వెంట కూడా దా దాపు 100 మంది పోలీసులు వచ్చారు. కమిషన్ సభ్యుడితో మాట్లాడుతున్న గిరిజనులను వీడియోలు తీసి.. కొంతమంది బిగ్‌బాస్‌కు పంపించినట్టు చర్చ జరిగింది. ఇదిలా ఉండగా తాండూర్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలను.. పోలీసులు రాచమర్యాదలు చేసి గ్రామానికి పంపించడం విమర్శలకు తావిచ్చింది.
అధైర్యపడొద్దు: ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్
ఎవరూ భయపడొద్దు.. జరిగిన సంఘటనను త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేందుక చొవర తీసుకుంటా.. మళ్లీ ఏదైనా జరిగితే నాకే స్వయంగా ఫోన్ చేయండి.. అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ లగచర్ల బాధితులకు భరోసా కల్పించారు. బయట ఉన్న వారిని తండాలకు రప్పించుకొని ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ఎటువంటి సంఘటనలు, ఇబ్బందులు కలిగినా తనకు ఫోన్ చేయాలని గిరిజన మహిళలకు తన ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. త్వరలో సమస్య పరిష్కరించబడి వాతావరణం సర్దుకుంటుందని హామీ ఇచ్చారు. లగచర్ల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌ను సస్పెండ్ చేయడంపై కమిషన్ బృందం మండిపడింది. ఈ ఘటనపై వెంటనే పునర్విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీని కోరారు.
పెయిడ్ బ్యాచ్ అని హేళన చేస్తుండ్రు..
బీఆర్ఎస్ నాయకులతో పైసలు తీసుకున్నామని, పెయిడ్ బ్యాచ్ అంటూ హేళన చేస్తుండ్రు. ఎవరితో ఎందుకు పైసలు తీసుకుంటం. బీఆర్ఎస్ నాయకులు మా దగ్గరకు ఎందుకొస్తరు.. మా భూములు మేము కాపాడుకునేందుకే పోరాడినం. మేమంతా కాంగ్రెస్‌కే ఓటేసినం. తిరుపతిరెడ్డి ఎవరు? ఆయనకు ఏం సంబంధం ఉందని మా భూములపై పడుతుండు. ఓటు చేసింది రేవంత్‌రెడ్డికి.. ఆయనతోనే తేల్చుకుంటాం. పార్టీలు మాకు అవసరం లేదు. మేం కష్టంతో కాపాడుకొంటున్న మా భూములే మాకు కావాలి. ఎవరు, ఏం చెప్పినా మా భూములు వదులుకునే ప్రసక్తే లేదు.
– పూజ, (ఇంటర్ విద్యార్థి) రోటిబండతండా, దుద్యాల మండలం
తిరుపతిరెడ్డికి ఏం అధికారం ఉంది?
సీఎం రేవంత్ తమ్ముడు తిరుపతిరెడ్డికి ఏం అధికారం ఉందని ప్రజలపై దౌర్జన్యం చేస్తుండు.. ఎస్కార్ట్‌తో గ్రామాలకు వస్తున్నడు.. మేము ఎన్నుకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. ఆయన ఇంతవరకు మా సమస్యలు పట్టించుకోలేదు.. అటువంటిది తిరుపతిరెడ్డి ఇన్వాల్వ్ కావడం ఏమిటి? ఆయనపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోండి.. నాకు ఈ సారే ఓటు హక్కు వచ్చింది. రేవంత్‌రెడ్డి వస్తే బతుకులు బాగుపడతాయని నా మొదటి ఓటు కాంగ్రెస్‌కే వేశా. ఇప్పుడు బాధపడుతున్నా. మా నాన్న ఎక్కడపోయాడో? ఏమయ్యాడో? వారం రోజులైంది..
– మంజుల, విద్యార్థిని, రోటిబండతండా, దుద్యాల మండలం, వికారాబాద్ జిల్లా
ముఖ్యమంత్రే మా కన్నీళ్లకు కారణం
ఈ రోజు మా అందరి కన్నీటిబాధలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కారణం. ఆయన గెలిస్తే మా ప్రాంతానికి నీళ్లొస్తాయని భావించి ఓటేసి గెలిపించాం. కానీ నేడు గిరిజనుల భూములు లాక్కొని నిరాశ్రయులను చేసేందుకు ఆయన ప్రయత్నిస్తుండు. ఏం జరిగినా మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. భూములు పోతే మేం ఏం తిని బతకాలి. ఉద్యోగమొద్దు.. పైసలొద్దు.. మా భూమే మాకు కావాలి.
– జ్యోతి, రోటిబండతండా, దుద్యాల మండలం, వికారాబాద్ జిల్లా