నిర్మల్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పరిపాలన ప్రతిభకు జాతీయ స్థాయిలో పట్టంకట్టారు. నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ఆధ్వర్యంలో కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోని విద్యార్థినులను అకాడమిక్ దిశగా బలోపేతం చేసేందుకు చేపట్టిన పోలీస్ అక్క కార్యక్రమానికి, కలెక్టర్ అభిలాష అభినవ్ గర్భిణుల మాతృ మరణాల కట్టడికి అమల్లోకి తీసుకొచ్చిన అమ్మ రక్షిత పథకం కార్యక్రమానికి జాతీయస్థాయి గుర్తింపు లభించాయి. ఎస్పీ, కలెక్టర్ చేపట్టిన ఈ కార్యక్రమాలకు వేర్వేరుగా స్కోచ్ అవార్డులు లభించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
వీరిద్దరికీ శనివారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్కోచ్ యాజమాన్యం అవార్డులు అందజేసింది. ప్రస్తుత సమాజంలో మహిళలు, విద్యార్థినుల భద్రతకు భరోసా కల్పించేలా ఎస్పీ జానకీషర్మిల ప్రారంభించిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం కమ్యూనిటీ పోలీసింగ్ మాడల్‌గా నిలిచి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించడమే కాకుండా, భావోద్వేగ, మానసిక, శారీరక భద్రతపై శిక్షణ అందిస్తున్నారు. మహిళా పోలీస్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తూ డయల్ 100 కాల్స్‌కు స్పందించి అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఏడు వేల మంది విద్యార్థినులు, మహిళలకు నేరుగా ప్రయోజనం చేకూరింది. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మల్ జిల్లాలో మాత్రమే ప్రవేశపెట్టిన ఈ పోలీస్ అక్క కార్యక్రమం.. నేడు జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించి ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును అందుకున్న ఎస్పీ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో జాతీయ స్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. డీజీపీ ఎక్స్ వేదికగా ఎస్పీ జానకీషర్మిలకు అభినందనలు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో గర్భిణుల మాతృ మరణాలు కట్టడికి కలెక్టర్ అభిలాష అభినవ్ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అమ్మ రక్షిత పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేశారు. ఇందులో భాగంగా మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ అయిన 45 రోజుల వరకు సమీపంలోని ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సహాయాన్ని అందజేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. గతంలో జిల్లా వ్యాప్తంగా ఏటా 25 వరకు మాతృమరణాలు చోటు చేసుకోగా, ఈ కార్యక్రమం అమలైన తర్వాత మరణాల సంఖ్య మూడుకు చేరుకున్నది. జిల్లా వైద్యారోగ్యశాఖ ద్వారా అందించిన ఈ సేవలను గుర్తించిన స్కోచ్ యాజమాన్యం కలెక్టర్‌కు అవార్డును అందజేయగా.. వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఇదరూ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోవడంపై పలుశాఖల అధికారులతోపాటు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.