రవీంద్రభారతి, అక్టోబర్ 6: ‘కులగణనపై జీవోల పేరిట కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 7 నుంచి 60 రోజుల వరకు డెడ్‌లైన్ విధిస్తున్నాం’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. బీసీల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి బీ సీల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో జాజుల మా ట్లాడారు. కులగణన చేయకుండా స్థానిక సంస్థ ల ఎన్నికలకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురవుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా కులగణనపై సీఎం, మంత్రులు మాట్లాడటం లేదని విమర్శించారు.
ఇదే వైఖరి అవలంబిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన చివరిది కాబోతుందని తెలిపారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంపై 50 వేల మందితో మహారాష్ట్ర ఎన్నికల్లో సర్కారు మోసాలపై ప్రచారం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణన పేరుతో బీసీలను మరోమారు మోసం చేయడానికి పూనుకున్నారని, ఆయన మాటలకు చేతలకు పొంతనలేదని చెప్పారు. త్వరలో కులసంఘాలు, మేథావులతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ కులసంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలపై నిలదీయండి
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలతోపాటు, రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ డిక్లరేషన్లపై కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గ్యారెంటీలు అమలు చేయకపోగా, అవ్వాతాతలకు పింఛన్ పెంచలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు బంధు వేయలేదని, రైతు భరోసా దికులేకుండా పోయిందని, బోనస్‌ను బోగస్ చేశారని ఆదివారం ఎక్స్‌వేదికగా దుయ్యబట్టారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 10 నెలలైనా అతీగతి లేదని, 4 వేల నిరుద్యోగభృతికి నీళ్లొదిలిందని విమర్శించారు. నిరుడు దసరా సందర్భంగా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. దసరాకు ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలయ్ -బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చించాలని కోరారు.