హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తేతెలంగాణ): ఓబీసీ రిజర్వేషన్ల అమలు కోసం దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని ఓబీసీలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం బీపీ మండల్ మనుమడు సూరజ్ మండల్, జాతీయ ఓబీసీ సంఘం నేత, తమిళనాడు ఎంపీ విల్సన్, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌తో శ్రీనివాస్‌గౌడ్ భేటీ అయ్యారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
బీసీలకు ప్రైవేట్ రంగంలో ప్రత్యేక కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఓబీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేశారు.