NIT | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లంటే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలన్న పేరున్నది. ఇంజినీరింగ్ టాప్ కాలేజీల్లో ఎన్‌ఐటీలదే అగ్రస్థానం. అలాంటి ఎన్ఐటీల్లో ఫ్యాకల్టీ కొరత వేధిస్తున్నది. ఇక్కడా.. అక్కడా అన్న తేడాల్లేకుండా అన్ని సంస్థల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. కీలక డిపార్ట్మెంట్లల్లో ఫ్యాకల్టీ లేక కాంట్రాక్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం ఎన్ఐటీల్లో 1,458 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇవి మినహాయిస్తే మరో 1,002 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉండగా, ఇవి కూడా ఖాళీకిందనే లెక్క. జాతీయంగా 31 ఎన్ఐటీలుండగా వీటిల్లో 7,483 ఫ్యాకల్టీ పోస్టులున్నాయి. వీటిలో 5,023 రెగ్యులర్, 1,002 కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. మొత్తం కలుపుకొంటే 6,025 మంది ఫ్యాకల్టీ మాత్రమే పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్‌లో అత్యున్నత విద్యను ఎన్ఐటీలు అందిస్తున్నాయి. ఎన్ఐటీ తిరుచురాపల్లి, సురత్కల్, వరంగల్, రూర్కీ, కాలికట్‌లు టాప్ -5 స్థానంలో నిలిచాయి. ఐఐటీల తర్వాత అత్యధికంగా ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అత్యధికులు ఎన్ఐటీలనే ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ఎన్ఐటీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడటంతో విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతున్నది.
తాజా వివరాల ప్రకారం ఎన్ఐటీల్లో 1.27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రిసెర్చ్ విద్యార్థులు గణనీయంగానే ఉంటారు. అయినా, ఈ సంస్థలకు కేంద్రం అరకొర నిధులనే కేటాయిస్తున్నది. బడ్జెట్ రూ. 4 వేల కోట్లకు మించడం లేదు. ఒక్క 2022 -23 విద్యాసంవత్సరం మినహా గత ఐదేండ్లల్లో అంతంత మాత్రంగానే నిధులను ఖర్చుచేసింది. ఇదంతా ప్రణాళికా వ్యయమే కావడం విశేషం. ప్రణాళికేతర కోటాలో నయా పైసా విదల్చలేదు. ఇటీవలికాలంలో విద్యాసంస్థల్లో రిసెర్చ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాజెక్ట్‌లను విరివిగా ప్రోత్సహిస్తున్నారు. ఈ దిశలో నిధుల కేటాయింపు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.