ASI : తెలంగాణలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆమోదించిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవ్వగా.. లోక్ సభలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి (Raghuveer Reddy) తెలంగాణలో మంజూరు చేసిన వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టులు, వాటి సంఖ్యపై ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Sekhawat) సమాధానమిచ్చారు. తెలంగాణలో భారత పురావస్తు సర్వే మంజూరు చేసిన వాసరత్వ పరిరక్షణ ప్రాజెక్టులు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ సంస్థ అధికార పరిధిలో ఎనిమిది కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
ఈ ఎనిమిది రక్షిత స్మారక చిహ్నాలు, సంరక్షణ ప్రదేశాల పరిరక్షణ.. నిర్వహణ నిరంతర ప్రక్రియ అని సభకు నివేదించారు మంత్రి గజేంద్ర సింగ్. వనరుల అవసరం, లభ్యత ప్రకారం ఇవి కొనసాగుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని స్మారక చిహ్నాలు మంచి సంరక్షణ స్థితిలో ఉన్నాయని పేర్కొన్న ఆయన.. తమ మంత్రిత్వ శాఖ 2022- 23 సంవత్సరంలో రూ.15.50 కోట్లు, 2023- 24 రూ.14.38 కోట్లు, 2024 -25కి రూ.6.80 కోట్లు కేటాయించిందని చెప్పారు. 2025- 26 సంవత్సరానికి రూ.9కోట్లను ఈ నవంబర్ వరకూ కేటాయించామని గజేంద్ర సింగ్ వివరించారు.