దండేపల్లి, డిసెంబర్1 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాలకు చెందిన ఆరేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటనలో మిస్టరీ వీడింది. వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తితో పాటు మరో వ్యక్తి కామాంధులై పసిప్రాణాన్ని కాటేశారు. సోమవారం దండేపల్లి పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన శనిగారపు బాపు భార్య ఆరు సంవత్సరాల క్రితం చనిపోయింది. అతడి ఇద్దరు పిల్లలు కూడా దూరంగా ఉంటున్నారు. మరో నిందితుడు ఉపారపు సతీశ్‌కు రెండేండ్ల క్రితం విడాకులయ్యాయి. వీరిద్దరూ తరచూ మద్యం తాగుతూ సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తూ జులాయిగా తిరిగేవారు.
ఈ నెల 24న ఇంటి పరిసరాల్లో చింత చెట్టు కింద ఆడుకుంటున్న చిన్నారిని నోరు మూసి పక్కనే ఉన్న చేనులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. అనంతరం గొంతు నులిమి బావిలో పడేసి పారిపోయారు. చీకటి పడినా బాలిక ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మూడో రోజు బావిలో శవమై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు మాదాపూర్ సమీపంలో నిందితులను పట్టుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని జిల్లా జడ్జికి రామగుండం కమిషనర్ అంబర్ కిశోర్ ఝా లేఖ రాయనున్నారని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు.