మడికొండ, డిసెంబర్ 1 : హనుమకొండ జిల్లా కడిపికొండలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగిన ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం వడ్డెగూడెంనకు చెందిన తాటికాయల సునంద నగరంలోని జయ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. పరీక్షల నేపథ్యంలో సోమవారం కళాశాలకు వచ్చి హాల్ టికెట్ తీసుకుని ఐనవోలు మండ లం వెంకటాపూర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్తున్నది. రాత్రి 7.30 గంటలకు కడిపికొండ మున్సిపల్ భవనం వద్దకు చేరుకోగానే ఓ బైక్‌పై వస్తున్న దుండగుల్లో ఒకరు సునందపై యాసిడ్ చల్లి వెనకాలే వస్తున్న మరో యువకుడి బైక్ ఎక్కి పరారయ్యా డు.
సునంద హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పినా నడుము, కాళ్లకు గాయాలయ్యాయి. కడిపికొండలోని తన పిన్ని వాళ్లకు సునంద సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. మడికొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టగా, అది యాసిడ్ కాదని, కెమికల్ అని ఇన్స్పెక్టర్ కిషన్ చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తి ఏదో ద్రవం పోయడంతో మంటగా ఉందని, దీనికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బా ధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 1: కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. జడ్చర్లలోని చైతన్యనగర్‌లో ఆటో నడిపే పాండుకుమార్ (43) సోమవారం రా త్రి ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోజ నం చేస్తున్నాడు. ఉడకబెట్టిన గుడ్డును తినే క్రమంలో గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక ఇబ్బంది పడగా కుటుంబీకులు దవాఖానకు తరలించారు. డ్యూటీ డాక్టర్లు గుడ్డు బయటకు తీసేందుకు యత్నిస్తుండగా పాండు మృతి చెందాడు.