నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు మరో మూడు కేసుల్లో అరెస్టు చేశారు. సోమవారం చంచల్గూడ నుంచి తరలించి, నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చారు. మూడు కేసుల్లో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఐదు కేసుల్లో రవిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో హాజరుపర్చారు. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, అతడు సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీలత వాదనలు వినిపించారు. బెయిల్పై విడుదలైన వెంటనే విదేశాలకు వెళ్లిపోతాడని, సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే అవకాశముందని తెలిపారు. పోలీసుల విచారణ పూర్తికాలేదని, మరో మూడుకేసుల్లోనూ అధికారులు విచారణ చేపట్టాల్సి ఉందని వివరించారు.
ఇప్పటికే నిందితుడిని ఎనిమిది రోజులపాటు పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ పూర్తి చేశారని, రవి తరఫు న్యాయవాది సీవీ శ్రీనాథ్ కోర్టుకు తెలిపారు. పాస్పోర్టుతోపాటు విదేశీ పర్యటన కార్డును జప్తు చేసి, షరతులతోకూడిన బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, దర్శకుడు దిల్ రాజుతోపాటు తండేల్ సినిమా పైరసీ పట్ల రవిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లోనూ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. జైలులోనే విచారించేందుకు అనుమతి కోరుతూ ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది. దీంతో రవి బెయిల్ మంజూరుపై సందిగ్ధత నెలకొన్నది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.