నిజామాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి జాతీయ రహదారి 44 దెబ్బతిన్నది. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద ఏరులైన పారిన వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు మధ్యలో 20 అడుగుల వెడల్పుతో భారీ గుంత ఏర్పడింది. హైవేపై వరద ప్రవాహం పెరగడంతో పోలీసులు వాహనాలను నియంత్రించారు.
వెనక్కి వెళ్లలేక, ముందుకు కదల్లేక వాహనాదారులు గంటల కొద్ది నరకప్రాయాన్ని అనుభవించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గేటు వద్ద నేషనల్ హైవే 44పై భారీ వరదతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బీబీపేట -కామారెడ్డి మార్గంలో బీటీ రోడ్డు కొట్టుకుపోయింది. పోచారం ప్రాజెక్టు ఉగ్రరూపంతో హైదరాబాద్-బోధన్ మార్గంలో హైలెవెల్ వంతెన ధ్వంసమైంది. హైవేపై నిలిచిన వరదను జేసీబీలతో మళ్లించి గురువారం ఉదయం నాటికి వన్‌వేలో వాహనాలను పంపించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వరపల్లి గ్రామ శివారులో భిక్కనూర్ – తలమడ్ల రైల్వే స్టేషన్ మధ్య వరద ఉధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకు పోయింది. 10 మీటర్ల పొడవునా రైల్వే పట్టాలు తెగిపోవడంతో రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలువరించింది. బుధవారం పలు రైళ్లను రద్దు చేయగా, గురువారం మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
నిజామాబాద్ – సికింద్రాబాద్ రైలు మార్గంలో రెండు చోట్ల ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేసి పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కాచిగూడ – నిజామాబాద్, మెదక్ – కాచిగూడ, కాచిగూడ – నాగర్సోల్, కాచిగూడ – పూర్ణ, బోధన్ – కాచిగూడ సర్వీసులను రద్దు చేసినట్టుగా సీపీఆర్వో శ్రీధర్ ప్రటనలో పేర్కొన్నారు. సీఎస్టీ ముంబాయి – లింగంపల్లి(17057) రైలును నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, పెద్దపల్లి ఐపాస్ కాజిపేట మీదుగా సికింద్రాబాద్‌కు దారి మళ్లించారు. అమరావతి – తిరుపతి(12766), నర్ఖేర్-కాచిగూడ(17642) రైళ్లు పూర్ణ పర్లి, వికారాబాద్ మీదుగా సికింద్రాబాద్ నుంచి కాచిగూడకు చేరుకోనుంది.
కుంభవృష్టి వానలతో జుక్కల్ నియోజకవర్గం తీవ్రంగా ప్రభావితమైంది. డోంగ్లి మండలంలోని సిర్పూర్, హాసన్టాక్లి, పెద్ద టాక్లి గ్రామల్లోని ప్రజలు ఇండ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. మహారాష్ట్రకు సరిహద్దులోని సలాబత్పూర్ ఆంజనేయశ్వామి ఆలయంలో మరికొందరు తాత్కాలిక వసతి పొందారు. పెద్ద టాక్లీలో కొన్ని కుటుంబాలు డోంగ్లి మండల కేంద్రానికి వెళ్లాయి. నిజాంసాగర్, కౌలాస్‌నాలా ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ మంజీరాలోకి వరదను వదలడంతో ముంపునకు గురవుతున్నాయి. పిట్లం మండలం కుర్తి గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది.
కామారెడ్డి జిల్లాలో వరదలో చిక్కుకున్న వారికి అన్నపానీయాలు కూడా అందలేదు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమవగా, బాధితులకు భోజనాలు సకాలంలో అందలేదు. జీఆర్, ఈఎస్ఆర్ గార్డెన్, హౌసింగ్ బోర్డు కాలనీల్లో తాగడానికి నీళ్లు కరువయ్యాయి. కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భోజనాలు అందజేశారు. కామారెడ్డిలో ఈసారి వినాయకచవితి వెలవెలబోయింది. కొన్ని విగ్రహాలు తయారీ కేంద్రాల్లోనే ఉండిపోయాయి. మరోవైపు వరదలో చిక్కుకున్న జనాలను కాపాడుకునేందుకు ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతారావు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. రక్షణ దళాలు వచ్చి బాధితులను రక్షించినప్పటికీ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రాలేకపోయాయి. ప్రాణాలకు తెగించి పోలీసులు, ఇతర రక్షణ దళాలు తాడు, బోట్ల సాయంతో బాధితులను ఒడ్డుకు తీసుకు వచ్చారు.