NEET | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మాతృభాషల్లోనూ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు విద్యార్థుల నుంచి స్పందన పెరుగుతుంది. ముఖ్యంగా గుజరాతీ, బెంగాలీ, తమిళభాషల్లో అత్యధికులు నీట్‌ను రాస్తున్నారు. 2019 నుంచి ఇంగ్లిష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ నీట్‌ను నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి బెంగాలీలో రాసే వారి సంఖ్య పదింతలు పెరిగింది. హిందీలో రాసేవారి సంఖ్య రెట్టింపైంది. గుజరాతీలో 58వేల మంది రాశారు. తమిళంలో 2019లో కేవలం వెయ్యి మంది మాత్రమే రాయగా, ఈఏడాది ఏకంగా 36వేల పైచిలుకు విద్యార్థులు రాశారు. 2019లో తెలుగులో 700 మంది ఉంటే ఈఏడాది 1,684 మంది హాజరయ్యారు. మాతృభాషాభిమానం అధికంగా ఉండే తమిళులు తమ భాషలో రాసేందుకు ఇష్టపడుతున్నారు.
తెలుగులో నీట్ రాసేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడంలేదు. 2019 నుంచి 2024 వరకు ఏటా రెండువేలు దాటడంలేదు. తెలుగుతో పాటు ఉర్దూ ఒడియా, పంజాబీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాష ల్లో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఇటీవలి కాలంలో ఇంగ్లిష్ మీడియంలో చదివినవారే ఎక్కువుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనోళ్లు ప్రాంతీయభాషలపై ఆసక్తి చూపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.