రాష్ర్టాల అసెంబ్లీల్లో దేశంపైనా చర్చ జరగాలి.. కేసీఆర్ పిలుపు
మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అధ్వానం
భారత్ అప్పు 152 లక్షల కోట్లు
జీఎస్డీపీ 11.5 లక్షల కోట్లు కాదు
రూ.14.3 లక్షల కోట్లు ఉండాలె
కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో
రూ.3 లక్షల కోట్లు కోల్పోయాం
కరోనాకుముందే ఆర్థిక వ్యవస్థ దిగజారింది
బలమైన కేంద్రం.. బలహీన రాష్ర్టాలు తగదు
ఇదే ఇప్పుడు బీజేపీ సర్కారు పాలసీ
కేంద్రం గొప్పగా ఉంటే దేశమంతా బాగుంటది
కేంద్రం చర్యలతో ప్రమాదంలో ఫెడరలిజం
రాజకీయాల్లో దూరి విషం నింపుతున్న పిగ్మీలు
రుణాల్లో 24 రాష్ర్టాల తరువాత తెలంగాణ
అప్పుల వల్ల మనకొచ్చే ప్రమాదం ఏమీలేదు
ఐదు ట్రిలియన్ల ఎకానమీ రంగులకలే..
దేశంలో మంచి పరిస్థితులు లేవు
జీడీపీ 8 శాతం నుంచి 6 శాతానికి పడిపోయింది
5లక్షల పైచిలుకు పరిశ్రమలు, సంస్థలు మూతపడ్డాయి
యూపీఏ ప్రభుత్వం కంటే చాలా దారుణంగా నిరుద్యోగిత రేటు
నిరుద్యోగిత రేటు యూపీఏ హయాంలో 4.7%. ఇప్పుడు 7.11%
ఆకలి సూచీలో దేశం ఆగమయ్యింది
హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం నెంబర్ 1
సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు
రాష్ర్టాల హక్కులు హరిస్తున్న కేంద్రం
శాసనసభలో సీఎం కే చంద్రశేఖర్‌రావు
ప్రజల హక్కుల పరిరక్షణలో ఇండియా ర్యాంక్ 88 నుంచి 119కి పోయింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో 80 నుంచి 131 స్థానానికి దిగజారింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93కు పడిపోయింది.
హైదరాబాద్, మార్చి 15 : బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్పగా ఉంటేనే దేశమంతా బాగుంటుందని అన్నారు. ఎఫ్ఆర్బీఎం విషయంలో కూడా కేంద్రం రాష్ర్టాలపై ఎన్నడూలేని ఆంక్షలు పెడుతున్నదని ఆరోపించారు. కేంద్రం విధానాలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా మారాయన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు కేసీఆర్ సమాధానం ఆయన మాటల్లోనే..
మన అప్పులు చాలా తక్కువ
దేశంలో కశ్మీర్ మినహా మిగిలిన 28 రాష్ర్టాల్లో అప్పులు చేసే విషయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉన్నది. జీఎస్డీపీలో మన అప్పులు 23% మాత్రమే. 40% కన్నా ఎక్కువ అప్పు చేసిన రాష్ర్టాలున్నాయి. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ అత్యధిక అప్పులు చేసింది. పంజాబ్ అప్పులూ మనకన్నా ఎక్కువే. 25వ స్థానంలో ఉన్నామంటేనే చాలా తక్కువ అప్పులు తీసుకున్నామని అర్థం. అప్పుల వల్ల మనకొచ్చే ప్రమాదం ఏమీలేదు. దేశంలో ఫిస్కల్ పాలసీ, ఆర్థికపరమైన అంశాలను నిర్ణయించేది, నిర్వహించేది, నియంత్రించేది కేంద్రమే. రాష్ర్టాలు ఇష్టమున్నా లేకున్నా దీన్ని పాటించాల్సిందే. అక్కడ గొప్పగా ఉంటేనే దేశమంతా బాగుంటది. ఈ పరిస్థితిని రాష్ర్టాల శాసనసభలు సమీక్ష చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఎఫ్ఆర్బీఎంపై ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో చాలా విచిత్ర ధోరణి కనబడుతున్నది. క్రమశిక్షణ అంతటా పాటించాలి. అది కనపడటంలేదు. ఇప్పుడున్న పద్ధతి బలమైన కేంద్రం, బలహీన రాష్ర్టాలు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే అవాంఛనీయ, అనారోగ్య, అప్రజాస్వామిక విధానం.
దేశం అప్పులు రూ.152 లక్షల కోట్లు
కేంద్ర పనితనం దిగజారి పోయిందని గణాంకాలే చెప్తున్నాయి. కేంద్రమే వివిధ పద్ధతుల్లో పార్లమెంటులో ఆర్థిక గణాంకాలు ప్రవేశపెడుతుంది. వీటి ప్రకారం చూస్తే కేంద్రం పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు. తలసరి ఆదాయం, జీడీపీ దారుణంగా ఉన్నది. దేశ జీడీపీలో కేంద్రం అప్పులు 58.5% అని ఆర్బీఐ, కేంద్రం వెలువరించిన నివేదికలే చెప్తున్నాయి. నేడు భారత్ అప్పు రూ.152 లక్షల కోట్లు. రాష్ర్టాలకు అనుమతిచ్చేదేమో 25 శాతం లోపు. ఈ నిబంధన కేంద్రం కూడా పాటించాలి కదా! వాళ్లను అడిగేవాళ్లు లేరు కాబట్టి ఇష్టమొచ్చినట్టు అప్పులు చేస్తరు.. రాష్ర్టాలనేమో తొక్కి పెడతరు. అంతవరకే ఆగి ఉన్నా బాగుండేది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని భయంకరంగా దెబ్బతీస్తున్నది. మొన్న నేను నూతన కలెక్టరేట్ ప్రారంభానికి వనపర్తికి పోతే అక్కడ ఒక చిన్న రోడ్డు వేయాలని స్థానికులు కోరారు. దీనికి కొంత అటవీభూమి అవసరం. 5 హెక్టార్ల వరకు ప్రజల అవసరాల కోసం అటవీ భూమిని తీసుకొనే అవకాశం రాష్ర్టాలకు నిన్నమొన్నటి వరకు ఉన్నది. ఇప్పుడున్న కేంద్రం దాన్ని ఒక హెక్టారుకు పరిమితం చేసింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తదా? పెంపొందిస్తదా? దీనిపై సమీక్ష జరగాలి. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగే విధానాలను ప్రతిపక్షం, అధికారపక్షం అనే తేడా లేకుండా ఖండించాలి.
ఐఏఎస్‌లను చెప్పుచేతల్లో పెట్టుకొనే కుట్ర
రాష్ర్టాల్లో ఆల్ ఇండియా సర్వీసు అధికారులు విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తరు. ఒక్కసారి క్యాడర్ అలాట్ చేశాక వాళ్లు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైపోతారు. ఇప్పుడు కేంద్రం ‘రూల్స్ మారుస్తం, ఏ రాష్ట్రంలోనైనా, ఏ అధికారినైనా ఎప్పుడంటే అప్పుడు వాపస్ పిలిపించుకొనే అధికారం తీసుకొంటం, మీ గొంతు కోస్తం’ అంటున్నది. ఇది దుర్మార్గమైన చర్య అని ఈ ఆలోచను ఉపసంహరించుకోవాలని కోరినం.
రాజకీయాల్లో పిగ్మీలు
ఈ మధ్య చాలామంది పిగ్మీలు రాజకీయాల్లోకి దూరి అవగాహన లేమితో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం తెచ్చే పనులు చేస్తున్నారు. ప్రేమపూర్వకంగా ఉన్న దేశంలో విషబీజాలు నాటుతున్నారు. ఇది ఎంతమాత్రం సహించరానిది. తాత్కాలికంగా కొందరికి ఇది రాక్షసానందం కలిగించవచ్చు.. కానీ లాంగ్న్‌ల్రో భారత సమాజ ఔన్నత్యాన్ని దారుణంగా దెబ్బతీసే చర్య ఇది. ప్రజాస్వామ్యం పరిణతి చెందే క్రమంలో చట్ట సభల్లో చర్చల సరళి మారాలి. అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దీ చర్చల సరళి, ఆలోచనా సరళి, సమకాలీన సామాజిక ధోరణులపై అద్భుత సమీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకొంటారు. వాటివల్ల మంచి ఫలితాలు వస్తాయి.
బడ్జెట్ బ్రహ్మ పదార్థమేమీ కాదు
బడ్జెట్ బ్రహ్మ పదార్థం కాదు. బడ్జెట్లో అంకెలు మాత్రమే చెప్తారన్న అభిప్రాయం దేశంలో ప్రబలంగా ఉన్నది. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రెండు విషయాలు గమనించవచ్చు. అధికార పక్షం ఆహా.. ఓహో.. ఇది అద్భుత బడ్జెట్’ అని పొగుడుతుంది. ప్రతిపక్షం పనికిమాలిన బడ్జెట్, పసలేని బడ్జెట్ అంటది. నాకు జ్ఞానం వచ్చిన 50 ఏండ్ల నుంచి ఇవే మాటలు వింటున్న. దీనిలో మార్పు లేదు. స్థూలంగా బడ్జెట్ అనేది నిధుల కూర్పు. ఈ కూర్పు రాష్ట్రం లేదా దేశ అభ్యున్నతికి ఎలా తోడ్పడాలన్నది అసలు విషయం. ప్రపంచంతోపాటు మన దేశ ఆర్థికవ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతున్నది. .
దేశ మొదటిబడ్జెట్ రూ.190 కోట్లు. అందులో రూ.91 కోట్లు రక్షణ రంగానికే. నేను 1978లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నప్పుడు నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ రూ.680 కోట్లు. మనం ఈ రోజు లక్షల కోట్లలో మాట్లాడుతున్నం. ప్రజాస్వామ్య దేశంలో అన్నింటికన్నా ముఖ్యం ప్లానింగ్ డిపార్ట్మెంట్. మన రాష్ట్రంలో ఆర్టీసీ, సింగరేణి వంటి పీఎస్‌యూలను అద్భుతంగా కాపాడుకొంటున్నం. ఆర్బీఐ ప్రచురించిన హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాస్టిటిక్స్లో డజన్ల కొద్ది విషయాల్లో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తున్నదని చెప్పింది.
దళారులు మాయం
మనం కఠోరమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం. అవినీతిని అణచివేసినం. గతంలో ఎన్నడూ లేని పారదర్శకతను ప్రవేశపెట్టినం. రైతుబంధు కింద రూ.50 వేల కోట్ల పైచిలుకు ఇచ్చాం. ఇది చిన్నమొత్తం కాదు. ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ డబ్బులు వేస్తే, అక్కడ రైతుల సెల్ఫోన్లకు టంగ్..టంగ్‌మని మెసేజ్‌లు వస్తున్నయ్. బ్యాంక్‌లో డబ్బులు జమైతున్నయ్. ఎవరికీ సెల్యూట్ కొట్టేది లేదు.. దళారులు మాయమైపోయారు. అనేక విషయాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తో పారదర్శకతను పెంచాం.
విద్యుత్తు సంస్కరణలు తేనె పూసిన కత్తి
దేశ రాజకీయాలు పెడధోరణులు పడుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితి కేంద్రానికి 6.9% ఉంటే.. రాష్ర్టాలకు ఇచ్చేది 4%. అందులో 0.5%కి ఆంక్షలు. మేం (కేంద్రం) అనుకునేది మీరు (రాష్ర్టాలు) చేస్తే ఆ 0.5% ఇస్తం, లేకపోతే ఇవ్వమంటున్నరు. కేంద్ర విద్యుత్తు సంస్కరణలను ఎవరైనా అమలు చేస్తేనే ఆ 0.5% ఇస్తరు.. లేదంటే ఇయ్యరు. 0.5%అంటే రూ.5 వేల కోట్లకు సమానం. ఆ సంస్కరణలు తేనె పూసిన కత్తి వంటివి.
డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్
ఇప్పుడు దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారు. అదే ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’. ఈ డబుల్ ఇంజిన్ గ్రోత్‌లో ఉన్న మర్మం ప్రజలకు తెలియాలి. బయట ఓ పుణ్యాత్ముడు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉన్న రాష్ర్టాలు చాలా బాగుపడ్డాయి అని అన్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ సర్కారు ఉండటం. సింగిల్ ఇంజిన్ గల తెలంగాణలో తలసారి ఆదాయం రూ.2.78 లక్షలు. డబుల్ ఇంజిన్ ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రూ.71 వేలు మాత్రమే. యూపీది దేశంలోని అన్ని రాష్ర్టాల్లో చివరి ర్యాంకు. ఇదీ డబుల్ ఇంజిన్‌లో జరిగిన అభివృద్ధి. అది డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్. ఉత్తరప్రదేశ్ ఆర్థిక వృద్ధిరేటు 7.26 శాతం. తెలంగాణ వృద్ధిరేటు 10.80 శాతం. యూపీలో 2017 నుంచి డబుల్ ఇంజిన్ గ్రోత్ మొదలైంది. 2017-21 మధ్య కాలంలో అక్కడ వృద్ధి రేటు 25.69 శాతం. సింగిల్ ఇంజిన్ గల తెలంగాణలో అదే కాలంలో వృద్ధి రేటు 55.46 శాతం. యూపీ అభివృద్ధి రేటు తెలంగాణలో సగం కూడా లేదు. సింగిల్ ఉన్న దగ్గర రూపాయి సంపాదిస్తే.. డబుల్ ఇంజిన్ ఉన్న దగ్గర ఆఠాణా (అర్ధ రూపాయి) సంపాదించారు. యూపీలో ప్రసూతి మరణాల రేటు 167, తెలంగాణలో 56. యూపీలో శిశు మరణాల రేటు 41 ఉంటే, తెలంగాణలో 23. ఇవన్నీ డబుల్ ఇంజిన్ డప్పుకొట్టే వాళ్ల ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే. ఈ డబుల్ ఇంజిన్, మత పిచ్చి, రాష్ర్టాల అధికారాలను హరించే పద్ధతులు, సంస్కరణల పేరుతో జరిగే మాయాజాలాన్ని తట్టుకొని తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది.
కేంద్రం వల్లనే మన వృద్ధిరేటు తగ్గింది
2014లో నాటి యూపీఏ ప్రభుత్వం మీద నానా రకాల నిందలు మోపి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ల పనితీరు బాగాలేదని, వీళ్లను అధికారంలోకి తెస్తే మొత్తం దేశమంతా నాశనం అయిపోయింది. అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్టు తయారైంది. ఆ రోజు దేశ వృద్ధి రేటు 8% ఉంటే, ఈ రోజు 6%కి పడిపోయింది. ఆర్థిక పరిస్థితి దిగజారుడుకు కారణం కరోనా కానేకాదు. కరోనా కన్నా ముందే దేశ ఆర్థికవ్యవస్థ దిగజారడం మొదలైంది. ఇది సత్యం. మన రాష్ట్ర జీఎస్డీపీ బాగా పెరుగుతున్నది. రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు పెరిగినం. తెలంగాణ స్థాయిలో కేంద్రం పనితీరు ఉండిఉంటే మన జీఎస్డీపీ రూ.14.3 లక్షల కోట్లు ఉండాలె. సంపద మనకు కూడా సమకూరాలంటే కేంద్రం కూడా సమాంతరంగా పనిచేయాలె. మనం ఏటా రూ.లక్ష కోట్ల సంపద పెంచుకుంటూ పోతున్నం. ఇదే కాలంలో దేశ జీడీపీ రూ.184 లక్షల కోట్ల నుంచి రూ.236 లక్షల కోట్లకు పెరిగింది. దేశ వృద్ధి రేటు కంటే మనది 38.7% ఎక్కువ. ఇది కేంద్రం చెప్పిన లెక్క. కేంద్రం అసమర్థ ఆర్థిక విధానాల వల్ల మనం రూ.3 లక్షల కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఆర్థిక నిర్వహణలో దేశం ఆర్థిక పరిస్థితి దారుణం. ఇవన్నీ ఆర్బీఐ హ్యాండ్‌బుక్‌లో ఉన్నాయి.
5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ రంగుల కల
5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనే భ్రమలు చూపిస్తున్నారు. ఇది దేవుడికే తెలియాలి. ఇటీవల పార్లమెంట్లో కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పుడు మనం 3.1 ట్రిలియన్ డాలర్లే ఉన్నం. కేంద్రం చెప్పుకొంటున్నట్టు 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు పోవాలంటే ఏటా సగటున 16% వృద్ధి ఉండాలి. కానీ ప్రస్తుత వృద్ధిరేటు 6 శాతమే. ఈ లెక్కన 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎలా చేరుతుంది? ఇదొక ఈస్ట్‌మన్ రంగుల కల.
భట్టివిక్రమార్కను పార్లమెంట్‌కు పంపాలి..
భట్టి విక్రమార్కకు ఈ సారి మాపైన దయ కలిగింది. మన ఊరు-మన బడి మంచి కార్యక్రమం అన్నందుకు చాలా సంతోషం. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలు ఎట్లా నాశనం చేస్తున్నరో ఆయన చాలా చక్కగా చెప్పారు. ఆయన అలా మాట్లాడుతుంటే.. ‘భట్టిగారు పార్లమెంట్లో ఉంటే బాగుంటది. ఈ అంశాలు పార్లమెంట్లో మాట్లాడాల్సినవి. అందరం కలిసి మన రాష్ట్రం పక్షాన ఆయనను పార్లమెంట్‌కు పంపాలి’ అని మావాళ్లు అంటున్నరు. కేంద్ర ప్రభుత్వంపై ఉన్న కోపాన్నంతా.. మాపై చూపుతున్నరు. నా ఆరోగ్యం గురించి మిత్రులు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క మంచి మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు.