హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఆల్ ఇండియా డెమెక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జాతీయ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పీకే శ్రీమతి, కననిక ఘోష్ ఎన్నికయ్యారు. 14వ జాతీయ మహాసభలు బుధవారం హైదరాబాద్లో ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం జాతీయ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 36 మందితో జాతీయ కార్యదర్శివర్గం, 114 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షురాలు అరుణజ్యోతి, ప్రభావతి, ఆశాలత, బండి పద్మకు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు.
దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ప్రతినిధులను కేంద్ర కమిటీలోకి నూతనంగా తీసుకున్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ మహాసభల్లో ఐద్వా అనేక తీర్మానాలను ఆమోదించింది. ముగింపు సభలో మరోసారి అధ్యక్షురాలిగా ఎన్నికైన పీకే శ్రీమతి మాట్లాడారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవితం అందించడం కోసం నేటి మహిళలు పోరాటమార్గంలో నడువాలని పిలుపునిచ్చారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలను అమలు చేయగలిగినప్పుడు, ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయని ప్రశ్నించారు. జాతీయ మహాసభల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒకరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మహిళా హక్కుల కోసం చివరిదాకా పోరాడుతామని ఐద్వా నూతన ప్రధాన కార్యదర్శి కననిక ఘోష్ బోస్ స్పష్టం చేశారు. మహాసభల ముగింపు అనంతరం జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి, జాతీయ కోశాధికారి తపసి ప్రహరాజ్, ఉపాధ్యక్షులు మరియం ధావ్లే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. హకులిస్తే తీసుకుంటాం.. లేదంటే లాకుంటామని, మధ్యలో వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నరేగా చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కార్మికుల సార్వత్రిక సమ్మెలో ఐద్వా పాల్గొంటుందని తెలిపారు. హైదరాబాద్లో నాలుగు రోజులపాటు జరిగిన ఐద్వా 14వ జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయని మహాసభల రిసెప్షన్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. ఈనెల 24 నుంచి బుధవారం వరకు ఈ సభలు జరిగాయని తెలిపారు.