కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 13: దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేవలం సీఎం కేసీఆరే అని దేశ ప్రజలు భావిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం ‘పట్టణ ప్రగతి’లో భాగంగా కరీంనగర్ నగరంలోని రాంనగర్లో రూ.35 లక్షలతో చేపట్టనున్న కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ఆలోచనలు చేస్తున్నారన్న ప్రకటనతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. దేశ ప్రజలు బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్ తయారవుతున్నారన్న చర్చ విస్తృతమవుతుందని పేర్కొన్నారు.
దేశంలో కొత్త, చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఎనిమిదేండ్లలోనే అద్భుతమైన ఫలితాలను సాధించిందపి స్పష్టంచేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని దేశమంతా కావాలని ప్రజలు కోరుకోవడం వల్లనే దేశ రాజకీయంలో కేసీఆర్ కీలక వ్యక్తిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇప్పటికీ గుజరాత్లో మహిళలు దూర ప్రాంతాలకు వెళ్లి తాగు నీరు తీసుకువస్తున్నారని, సాగునీరు లేక అక్కడి రైతులు భూములను ఎండపెట్టుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ మాటే తనకు శిరోధార్యమని, ఆయన ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని మంత్రి ఉద్ఘాటించారు.