Nateshwara Sharma | హైదరాబాద్ : సంసృతాంధ్ర విద్వతవి, అష్టావధాని, దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగు, సంస్కృతంలో 60కి పైగా గ్రంథాలను రచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవిగా తన గొంతు విప్పారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామంలో జన్మించిన నటేశ్వర శర్మ పద్య, గేయ, వచన ప్రక్రియల్లో కవిత్వం రాశారు. 50కి పైగా కావ్యాలు ప్రచురించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రాచ్య విద్యా పరిషత్ కళాశాల ప్రధానాచార్యులగా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. 2011 నుంచి 2013 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రాచ్య భాషా విభాగానికి డీన్‌గా పని చేశారు. ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరిపై పరిశోధనకు గానూ 1994లో ఓయూ నుంచి డాక్టరేట్ పట్టా, స్వర్ణ కంకణం పొందారు. ఆముక్తమాల్యదపై ఆయన రాసిన విమర్శన గ్రంథాన్ని తెలుగు యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సంసృతాంధ్ర భాషల్లో శర్మ నూటికిపైగా అష్టావధానాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతిష్టాత్మక దాశరథి పురసారంతో సత్కరించింది.
నటేశ్వర శర్మకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గత సంవత్సరం జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో నటేశ్వర శర్మ పద్య పాదాన్ని ఉటంకించారు. అయాచితం మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని పలువురు కవులు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. నటేశ్వర శర్మ మృతికి ఘన నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Inter Admissions | 15 వరకు ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు
KTR | పసిపాప కన్నీళ్లు చూసైనా.. సర్కార్‌కు కనికరం కలగలేదా..! : కేటీఆర్
KTR | 2 రోజుల్లో 35 మంది విద్యార్థులకు విష జ్వరాలా..? సర్కార్ ఏం చేస్తుందని కేటీఆర్ నిలదీత..!