హాజీపూర్/ కొత్తగూడెం గణేశ్ టెంపుల్/ కొత్తగూడెం టౌన్, జనవరి 20: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన రామవరం ఏజెన్సీ ప్రాంతాన్ని తొలగించాలని గిరిజన జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కలుపొద్దని సీపీఎం అనుబంధ రైతు సంఘం నేతలు పేర్కొన్నా రు.
కార్పొరేషన్ వద్దు.. గ్రామ పంచాయతే మద్దు’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ నర్సింగాపూర్ను విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు రహదారి-63పై రాస్తారోకో చేసేందుకు రాగా మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ దేశ్పాండే గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో రోడ్డు పక్కన టెంట్, వంట సామగ్రిని తెప్పించుకొని ధర్నా చేపట్టారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్, ఏసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.