చెన్నారావుపేట, డిసెంబర్ 25 : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులు డిమాండ్ చేశారు. చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన పలువురు బహిష్కృత కాంగ్రెస్ నాయకులు గురువారం మీడియాతో మాట్లాడారు. చెన్నారావుపేటలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం తాము కాదని, అభ్యర్థిని ఖరారు చేసిన ఎమ్మెల్యే, ఆయన వెంట ఉన్న చోటామోటా నాయకులే బాధ్యులన్నారు. రెండేండ్లుగా ముఖ్యమంత్రికి దూరంగా ఉన్న ఎమ్మెల్యే.. తన తల్లి మరణాన్ని సెంటిమెంట్‌గా వాడుకొని ఆయనకు దగ్గరయ్యాడని ఆరోపించారు.
రా ష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నర్సంపేటలో ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్ర చారం చేశాడని, అయినా మండల కేంద్రాలతోపాటు మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయినట్టు తెలిపారు. దీనికి ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్యే తమ వాదనను పట్టించుకోలేదని, ప్రచారం జోలికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్న దొంతి తమను బహిష్కరించడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
నియోజకవర్గంలో తమది మొదటి నుంచీ కాంగ్రెస్ కుటుంబం అని.. చెన్నారెడ్డి నుంచి మొదలుకొని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వరకు తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారని, అలాంటిది ఏ కారణం లేకుండా తమను పార్టీ నుంచి ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నించారు. తమ వల్ల పార్టీ అభ్యర్థి ఓడిపోయాడని బహిష్కరించిన ఎమ్మెల్యే.. తన సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఏసీపీని కాపలా పెట్టి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందిపాలు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, చీరలు పంపిణీ చేస్తే 80 ఓట్ల మెజారిటీతో గెలిచారని తెలిపారు.
ఇది కూడా ఓ గెలుపా?.. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. పార్టీ గుర్తులకతీతంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ ఇష్టానుసారంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటారని, అలాంటప్పుడు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలే తప్ప కొందరిని నిందించకూడదని సూచించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా చెన్నారావుపేట గ్రామంలో రెండు పర్యాయాలు మీటింగ్‌లు పెట్టి కూడా అభ్యర్థికి ఓట్లు వేయించలేక పోయాడని విమర్శించారు.