హైదరాబాద్, నవంబర్ 8( హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మరోమారు నిరాశే ఎదురైంది. తన బర్త్‌డే వేళ అధిష్ఠానం నుంచి విషెస్ వస్తాయని పొద్దంతా ఎదురుచూసిన రేవంత్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో ఏడాది కూడా అధిష్టానం ఆశీస్సులు అందలేదు. రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో బడేభాయ్ మోదీ నుంచి, ఎన్డీయే కూటమి నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కానీ, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గే వంటి వారి నుంచి విషెస్ అందలేదు. సాయంత్రం వరకు ఎదురుచూసినా మెసేజ్ కానీ, ఫోన్ కానీ రాకపోవడంతో సీఎం నిరాశ చెందినట్టు తెలిసింది. అధిష్ఠానం నుంచి ఆశీర్వాదం అందలేదని తెలిస్తే ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలు వెళ్తాయన్న భయం నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేయకున్నా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారన్న ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాహుల్ ఫోన్ చేసి విషెస్ చెప్పినట్టు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీఎంవో గ్రూప్ పోస్ట్ చేసింది.
రేవంత్‌రెడ్డికి మొట్టమొదట ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 7.30 గంటలకే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. దానిని సీఎంవో అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో యథాతథంగా పోస్టు చేసింది. ఇక్కడ నుంచి వరుసగా పార్లమెంటు స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా , పంజాబ్ గవర్నర్ గులాబ్‌చంద్ కటారియా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, రామ్మోహన్నాయుడు, లోకేశ్, బాలకృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. అనంతరం మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ , కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గం మూకుమ్మడిగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఇటీవల సీఎం టార్గెట్‌గా పంచాయితీ పెట్టిన మంత్రి కొండ సురేఖ కూడా సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన వారి పేర్లను సీఎంవో కార్యాలయం అధికారిక సోషల్ మీడియా గ్రూప్‌లో చేసిన పోస్టుల్లో ఢిల్లీ అధిష్ఠానం పేర్లు కనిపించలేదు. రెండేండ్ల నుంచి 55 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి 14 సార్లు రాహుల్ అపాయింట్మెంట్ కోసం ప్రాధేయపడినా ఆయన అనుమతించ లేదని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఈ ఏడాది ఆగస్టులో రాహుల్‌గాంధీ తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులను బీహార్‌కు పిలిపించారు. బీహార్‌లోని సుపాల్‌లో నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో రాహుల్ తన పక్కన రేవంత్‌ను, ప్రియాంకను నిలబెట్టుకొని రోడ్ షో చేశారు. ఆ ఫోటోలు, వీడియో క్లిప్పింగులు ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియాలోకి డంప్ చేయించిన రేవంత్ తనకు అధిష్ఠానం మధ్యం గ్యాప్ లేదని డప్పుకొట్టించారు. బీహార్ ఎన్నికలకు తానే స్టార్ క్యాంపెనర్ అన్నంత బిల్డప్ ఇచ్చారు.
గతంలో లేనంతగా ఈ సారి సినిమా తారలు రేవంత్‌రెడ్డిని శుభాకాంక్షలతో ముంచెత్తారు. పుష్ప-2 సినిమా తొక్కిసలాటలో అల్లు అర్జున్‌తో ఏర్పడిన వివాదం, సినీ హీరో నాగార్జున కుటుంబం మీద సహచర మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సినిమా రంగం రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వంపై గుర్రుగా ఉందని కొంత కాలంగా ప్రచారంలో ఉన్నది. ఈ నేపథ్యంలో షాడో సీఎంగా గుర్తింపు పొందిన రోహిన్‌రెడ్డి ఆర్గనైజ్డ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఒక్కొక్క హీరోకు పేరు పేరునా ఫోన్ చేస్తూ సీఎంకు శుభాకాంక్షలు చెప్పించారని ప్రచారం జరుగుతున్నది.
బీహార్ ప్రజల డీఎన్ఏలోనే కూలీతనం ఉందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీహార్లోనే కాదు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డితో కలిసి బీహార్ ఎన్నికలకు వెళితే మరింత డ్యామేజ్ తప్పదని భావించిన ఏఐసీసీ ఆయనను స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తప్పించింది. బీహార్ వైపు రావవద్దని ఆదేశించింది. ఆయన స్థానంలో రెవెన్యూ మంత్రి పొంగులేటిని పంపాలని కోరింది. వాయవ్య బీహార్‌లోని తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, భోజ్‌పూర్ తదరితర జిల్లాలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు. అదే సమయంలో ఢిల్లీ బీజేపీ ఆయనను దగ్గరకు తీస్తోందని, ఆయన కోరినప్పుడల్లా ఢిల్లీలో ప్రధాని, నడ్డా, అమిత్‌షా వంటి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు ఇస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.