వికారాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఫార్మా విలేజ్ కోసం భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల వెళ్లిన అధికారులపైకి రైతులు ఎదురుతిరిగిన ఘటనలో అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లగచర్ల గ్రామానికి చెందిన 20 మంది రైతులను రిమాండ్ చేసిన పోలీసులు బుధవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో ఉదయం వాకింగ్ చేస్తుండగా నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 10 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకువచ్చి ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. అనంతరం ఆయనను తొలుత పరిగి పోలీస్‌స్టేషన్‌కు ఆపై కొడంగల్‌లోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తరువాత కొడంగల్ కోర్టులో నరేందర్‌రెడ్డిని హాజరుపర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్‌లో మొదట బోగమోని సురేశ్‌ను ఏ1గా పేర్కొన్న పోలీసులు ఇప్పుడు పట్నం నరేందర్‌రెడ్డిని ఏ1గా మార్చారు.
అక్రమ అరెస్ట్‌పై ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం ఆయనతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. బీఆర్ఎస్ మొత్తం ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నరేందర్‌రెడ్డి అరెస్ట్‌పై కోర్టులో పోరాటం చేస్తామని, ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలపై పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.
పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఖండించారు. నరేందర్‌రెడ్డి సతీమణిని హైదరాబాద్‌లోని వారి ఇంట్లో సబితారెడ్డి పరామర్శించారు. మా భూములు ఇవ్వబోమని రైతులు చెప్తున్నా కేసులు పెట్టి భయపెట్టడం ప్రభుత్వానికి తగదని అన్నారు. ప్రజలను ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని బలవంతంగా, భయపెట్టి ప్రజల నుంచి భూములను లాక్కోవడం సరికాదని అన్నారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీటీసీకి తీసుకువచ్చిన నరేందర్‌రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డితోపాటు వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి డీటీసీలో పోలీసుల అదుపులో ఉన్న నరేందర్‌రెడ్డిని కలిసి ధైర్యం చెప్పారు.