హైదరాబాద్,జనవరి31(నమస్తే తెలంగాణ): మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పక్కనపెట్టి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. శుక్రవారం ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డిని కాదని నరేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జీవన్‌రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల నుంచి పంపించే ప్రయత్నమే ఇది అని మండిపడుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి.
సచివాలయంలో రికార్డుస్థాయి బదిలీలు
హైదరాబాద్, జనవరి 31 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర సచివాలయంలో రికార్డుస్థాయి బదిలీలు జరిగాయి. శుక్రవారం ఒకేసారి 177 మంది సెక్షన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎ స్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశా రు. 160 మందిని వివిధ శాఖలకు అదే హోదాలో బదిలీచేయగా, 17 మందికి పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్స్ ఇచ్చారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా సచివాలయంలో మార్పులు చేసే క్రమంలోనే ఈ బదిలీలు జరిగినట్టు చెప్తున్నారు. గతేడాది ఆయా శాఖల కార్యదర్శులు, అడిషనల్, అసిస్టెంట్ కార్యదర్శులను బదిలీ చేసింది. ఇప్పుడు ఎస్‌వోలను బదిలీ చేసినట్టు చెప్తున్నారు.