ISRO | ఉస్మానియా యూనివర్సిటీ: అంతరిక్ష రంగంలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్త్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నది. ఆ క్రమంలో త్వరలోనే 40 అంతస్తుల ఎత్తయిన రాకెట్‌ను రూపొందించనున్నామని సంస్థ చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ వెల్లడించారు. ఈ రాకెట్ దిగువ భూకక్ష్యలో 75 వేల కిలోల పేలోడ్‌ను చేర్చనున్నదని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన 84వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం తమ ముందు మూడుకు పైగా ప్రాజెక్టులున్నాయని చెప్పారు. నావిక్ ఉపగ్రహం, ఎన్ఐ రాకెట్ ప్రయోగంతోపాటు అమెరికాకు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలో చేర్చాల్సి ఉన్నదని తెలిపారు. 2035 నాటికి 52 టన్నుల భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నామని, మరోవైపు వీనస్ ఆర్బిటర్ మిషన్‌పై ఇస్రో పనిచేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం రేపటితరం వాహకనౌకను రూపొందించడంపై దృష్టిని కేంద్రీకరించామని తెలిపారు.
‘మీకు రాకెట్ సామర్థ్యం ఎంతో తెలుసా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రూపొందించిన మొదటి రాకెట్ 17 టన్నుల లిఫ్ట్ఆఫ్తో 35 కిలోల ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్యలో చేర్చింది. కానీ నేడు 75వేల కిలోల బరువైన పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి చేర్చడానికి అవసరమైన రాకెట్‌ను రూపొందిస్తున్నాం. ఈ రాకెట్ 40 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది’ అని చెప్పారు. ఈ ఏడాది ఇంకా టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ ఉపగ్రహం (టీడీఎస్)ను, భారత సైన్యం కోసం ఓ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఆర్‌ను ప్రయోగించనున్నామని తెలిపారు. భారత నౌకాదళం కోసం రూపొందించిన జీశాట్-7 (రుక్మిణి) స్థానంలో జీశాట్-7ఆర్‌ను చేర్చనున్నామని వివరించారు. ప్రస్తుతం భారత్‌కు చెందిన 55 ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయని తెలిపారు. మరో మూడునాలుగేండ్లలో ఈ సంఖ్య మూడు రెట్లు పెరగనున్నదని చెప్పారు.
అగ్ర దేశాలతో సమానంగా
అంతరిక్ష పరిశోధనల్లో నేడు అగ్రరాజ్యాలతో సమానంగా భారత్ రాణిస్తున్నదని నారాయణన్ చెప్పారు. భారత్ ఇప్పటికి నాలుగువేలకు పైగా రాకెట్లను ప్రయోగించిన ఘనతను సొంతం చేసుకున్నదని తెలిపారు. భారత్ మొదటిసారి 1975లో మూడు ఇతర దేశాల సహకారంతో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించిందని చెప్పారు. నాటి నుంచి ఇప్పటివరకు వివిధరకాల 133 ఉపగ్రహాలను దేశం కోసం ప్రయోగించిందని తెలిపారు. చంద్రుడిపై ఉన్న 32 సెంటిమీటర్ల రిజల్యూషన్‌తో కూడిన బెస్ట్ కెమెరా భారత్‌దేనని చెప్పారు. మొదటి ప్రయత్నంలోనే మార్స్ (అంగారక గ్రహం) ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ముగించిన ఏకైన దేశం భారత్ అని, ఇది ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యం కాలేదని వివరించారు. ఒకే రాకెట్ సాయంతో మొదటి ప్రయత్నంలోనే 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షానికి చేర్చిన మొదటి దేశం భారత్ కాగా, మొదటి సంస్థ ఇస్రో మాత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా నారాయణన్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. స్నాతకోత్సవంలో మొత్తం 121 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 1258 పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శుభాంశుకు గండం తప్పింది!
ఇటీవల అంతరిక్ష కేంద్రానికి వెళ్లి విజయవంతంగా తిరిగివచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు అంతకుముందు పెద్ద గండం తప్పిందని నారాయణన్ వెల్లడించారు. నిజానికి వారి రాకెట్ జూన్ 11న అంతరిక్షానికి బయలుదేరాల్సి ఉన్నదని చెప్పారు. కానీ ఒకరోజు ముందు శుక్లా నేతృత్వంలోని ఓ బృందం రాకెట్లో లీకేజీని గుర్తించిందని తెలిపారు. ఆ రాకెట్‌ను అలాగే పైకి ఎగిరి ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేదని అన్నారు. భారతీయుల పట్టుదల, భారతీయ విద్యా వ్యవస్థ, ఇశ్రో శిక్షణ ఆధారంగా ఆ లోపాన్ని సరిదిద్దామని తెలిపారు. దీంతో శుక్లాతోపాటు మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా వెళ్లి వచ్చారని చెప్పారు.