హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ) : అడవుల్లో నిక్షిప్తమైన సంపదను చెరబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నదని రాష్ట్ర పౌరహక్కుల ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్లిపోయిన జాతీయ పార్టీలు దేశంలోని సహజ సంపదను వారికి అప్పగించేందుకే 2005లో సల్వాజుడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్‌హంట్, 2024లో ఆపరేషన్ కగార్ వంటి హత్యాకాండలు చేపడుతున్నాయని ధ్వజమెత్తారు.
ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పరిధిలోని అడవుల్లో వజ్రాలు, ఇనుము, బొగ్గు, సున్నపురాయి, డోలమైట్, బాక్సైట్ సహా 28 రకాల ఖనిజాలు ఉన్నాయని వివరించారు. వాటిని తవ్వుకునేందుకు వివిధ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం వందకు పైగా ఎంవోయూలు చేసుకున్నదని, ఆ కంపెనీల ఒత్తిడి మేరకే 2026 నాటికి దేశంలో ఉన్న మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారని తెలిపారు.