వేర్వేరు పార్టీల్లో ఉన్నా ఇద్దరిదీ ఒకే గట్టు.. ఒకే గుట్టు..!రాష్ర్టాలు, రాజకీయ వేదికలు వేరైనా.. ఇద్దరిదీ ఒకే జట్టు!చంద్రబాబు గురువైతే.. రేవంత్ శిష్యుడు!.. ఇద్దరిదీ బలమైన బంధం!పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రహస్యంగా సమావేశమవడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నది. గురువారం వేర్వేరుగా ఢిల్లీకి వెళ్తూ.. వారిద్దరూ బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత, ఇటీవల మోదీతో సఖ్యత నెరుపుతున్న కాంగ్రెస్ సీఎం.. ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నది.
CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): గురుశిష్యులుగా చెప్పుకొనే మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా కలుసుకున్నట్టు పలు వెబ్సైట్లు వార్తలు ప్రచురించాయి. ఏపీలో త్వరలో లోక్‌సభతోపాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరగా.. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని పెద్దన్న అని, బీజేపీ నేతృత్వంలోని గుజరాత్లో పాలన అద్భుతమని పొగిడిన రేవంత్‌రెడ్డి తన గురువుతో చాటుమాటుగా భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీతో జతకట్టడానికి వెళుతున్న నాయకుడితో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంతటి గురుశిష్యుల బంధమైనా వైరి రాజకీయ కూటముల్లో (ఎన్డీయే, ఇండియా కూటములు) ఉన్న ఈ ఇద్దరు నేతలు రహస్యంగా కలుసుకోవడంపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీకి బీజేపీ పెద్దల ప్రోద్బలం ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రణాళిక ప్రకారమే భేటీ
ఏపీలో జగన్ సర్కార్‌ను ఏమి చేసైనా కూల్చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ఇప్పటికే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో జతకట్టి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. ఆ ప్రయత్నంలోనే బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు ఆయన గురువారం ప్రత్యేక విమానంలో బయల్దేరేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. లోక్‌సభ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముఖ్యమైన నేతలను కాంగ్రెస్ అధిష్ఠానం పిలవడంతో రేవంత్ ఢిల్లీ బయలుదేరారు. రేవంత్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఆహ్వానం పంపింది. అయితే కేంద్ర మంత్రులతో భేటీ ఉన్నందున భట్టి విక్రమార్క ఉదయమే ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక రేవంత్, ఉత్తమ్ కలిసి ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. రేవంత్ ఒకింత ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్టు తెలిసింది. చంద్రబాబును కలుసుకొనేందుకే ఆయన ముందుగా వచ్చినట్టు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు బాబు, రేవంత్ మంతనాలు సాగించినట్టు చెప్తున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ విమాన ప్రయాణికులు కనీసం గంట ముందు విమానాశ్రయాలకు చేరుకోవాలి. కానీ కేవలం తమ కోసమే ఈ ఇద్దరు నేతలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకున్నందున వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే అవి టేకాఫ్ అవుతాయి. అందువల్ల బాబు, రేవంత్‌ల భేటీ యాదృచ్ఛికం కాదు ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
2 గంటల పాటు చర్చోపచర్చలు
చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తున్నది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని ఆయన తన శిష్యుడు రేవంత్‌ను కోరినట్టు సమాచారం. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీ కనీసం తన అభ్యర్థులను పోటీకి కూడా దించలేదు. ఇందుకు ప్రతిఫలంగా తనకు ఏపీ ఎన్నికల్లో సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్టు చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ తగిన సాయం చేస్తానని రేవంత్ తన గురువుకు వాగ్దానం చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాత్రం ఎటువంటి మద్దతు ఉండదని చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో కాం గ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగనున్న అభ్యర్థులపైకూడా సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్టు వినికిడి. తెలంగాణలో టీడీపీకి ఎలాగైనా జవసత్వాలు కలిగించాలని భావిస్తు న్న చంద్రబాబుకు.. కాంగ్రెస్ పార్టీ నుంచైనా తన శిష్యుడు సీఎం కావడంతో ఒకింత ఆశ పెరిగింది. ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దుల నుంచి ఎలాంటి సహాయాన్ని కావాలనుకుంటున్నారో చంద్రబాబు తన శిష్యుడితో స్పష్టంగా చర్చించినట్టు తెలుస్తున్నది. టీడీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే బడాబాబులందరూ.. హైదరాబాద్‌లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నవారే. ఈ నేపథ్యంలో వారి నుంచే ఎన్నికల ఖర్చులకు నగదును తరలించాల్సి ఉంటుంది. ఈ కోణంలోనూ రేవంత్ నుం చి సహాయ సహకారాలు కోరి ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల తర్వాత స్పష్టత
తెలంగాణలో పదేండ్లపాటు పాలన సాగించిన బీఆర్ఎస్ను ఓడించేందుకు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి కృషి చేశారు. వీరికి బీజేపీ కూడా తోడయ్యింది. అధికారానికి వచ్చిన తరువాత రేవంత్‌రెడ్డి పాలన ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తలపిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం నాయకులైన ప్రస్తుత మంత్రి సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి.. రేవంత్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్‌లో చేరారు. అధికారాన్ని చేపట్టింది మొదలు రేవంత్ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తన వర్గాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధించడం, బీజేపీ పాలనను అభినందించడం.. మరోవైపు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పడం.. ఇంకోవైపు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం.. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.