Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నేతకు చెక్ పెట్టేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరగా తాజాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనగామలో తన అనుచరుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు పొన్నాలకు పొగ బెట్టారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ ప్రచార కమటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీని సైతం రేవంత్‌రెడ్డి టార్గెట్ చేశారనే ప్రచారం నడుస్తున్నది.
బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీకి చెక్ పెట్టేందుకు అదే సామాజికవర్గానికి చెందిన మరోనేత ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ను ప్రయోగిస్తున్నారనే టాక్ వినిపిస్తున్నది. ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న 24 గంటల లోపే ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లి ఎల్బీనగర్ టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. పార్టీలోని పలువురు సీనియర్ బీసీ నేతలను దెబ్బతీసేలా రేవంత్‌రెడ్డి పన్నుతున్న వ్యూహాలపై ఆ వర్గం నేతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మధుయాష్కీ ఈసారి ఎల్బీనగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంటనే స్థానికేతరుడైన మధుయాష్కీకి టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీభవన్‌లో పోస్టర్లు వెలిశాయి. తన స్వస్థలం హయత్‌నగర్ అని, తాను స్థానికుడినేనని యాష్కీ వాదించుకోవడంతో ఆ వాదన వీగిపోయింది. దీంతో యాష్కీకి లైన్‌క్లియర్ అయిందని బీసీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ తెర మీదకు వచ్చారు. గురువారం ఆయనను తన ఇంటికి పిలిపించుకొని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు.
ఆ వెంటనే ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. రామ్మోహన్, యాష్కీ అభ్యర్థిత్వంపై సర్వే నిర్వహించి, ఎవరికి అనుకూలంగా రిపోర్టు వస్తే వారికే టికెట్ అనే ప్రచారం శుక్రావారం రాత్రి నుంచి కాంగ్రెస్‌లో జరుగుతున్నది. గతంలోనూ అనేక నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి ఇదే అస్త్రంతో ఇతర నేతలకు చెక్ పెట్టి తన అనుయాయులకు టికెట్ ఇప్పించుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే టికెట్ల కోసం కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.