హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నేతలు, జిల్లా నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపికతోపాటు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నేతలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై చర్చించారు. గ్రామాలవారీగా సమీక్షలు, మండలాలవారీగా రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించారు. హరీశ్‌రావు, ఇతర నేతలు పలువురు అభ్యర్థుల పేర్లను కేసీఆర్‌కు సూచించారు. తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ అధినేతకే అప్పగించారు. ప్రధానంగా గాలి అనిల్‌కుమార్, శివకుమార్, మఠం భిక్షపతి తదితరుల పేర్లను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారేమో పరిశీలించాలని భావిస్తున్నారు. సోమవారం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉన్నది. కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నేతలు గంప గోవర్ధన్, జాజల సురేందర్, హన్మంత్‌షిండే, గాలి అనిల్‌కుమార్, శివకుమార్, క్రాంతికిరణ్, దేవీప్రసాద్, జైపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ముజీబ్, పోచారం భాస్కర్‌రెడ్డి, సుమిత్ర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.