తిరుమలాయపాలెం, జూలై 6: ఖమ్మం జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలోని తిరుమలాయపాలెం సహకార సొసైటీ, మార్క్‌ఫెడ్ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కజొన్నలు అమ్ముకున్న రైతుల పేర్లు ఆన్లైన్లో గల్లంతై వారి ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడుకు చెందిన పలువురు రైతులు గత మే 10న తిరుమలాయపాలెం సొసైటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 362 క్వింటాళ్ల మక్కజొన్నలు అమ్మారు. పంటను యాదాద్రి భువనగిరి జిల్లా టేకులసోమవరం గిడ్డంగిలో దిగుమతి చేశారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్, తిరుమలాయపాలెం సొసైటీ అధికారులు రైతులకు రసీదుతోపాటు ట్రక్ షీట్ కూడా ఇచ్చారు. నెలలు గడుస్తున్నా మక్కజొన్నల డబ్బులు తమ బ్యాంక్ ఖాతాలో పడకపోవడంతో బాధిత రైతులు బీఆర్ఎస్ మండల నాయకులతో ఖమ్మం మార్కెట్ కార్యాలయానికి వెళ్లారు. డబ్బులు అకౌంట్లో జమకాని విషయమై వివరణ కోరారు. ఈ విషయమై మార్క్‌ఫెడ్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ కల్యాణ్‌కుమార్ పరిశీలించి ‘మీ పేర్లు అసలు ఆన్లైన్లో కనిపించడం లేదు. మీరు మక్కజొన్నలు అమ్మారా? లేదా ఎవరికి తెల్సు’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు రైతులు వాపోయారు. ఈ విషయమై ఫోన్లో మార్క్‌ఫెడ్ డీఎంకు ఫిర్యాదు చేశారు.
డబ్బులు వస్తాయో లేదో తెలుస్తలేదు
ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కజొన్నలు అమ్ముకుంటే ఆన్లైన్లో పేర్లు లేవంటున్నారు. అధికారులు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు మక్కజొన్నల డబ్బులు వస్తాయో రావో అర్థంకావడం లేదు. భయంగా ఉంది. దయచేసి ఉన్నతాధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలి.
– బొమ్మగాని సైదమ్మ, మహిళా రైతు, తెట్టెలపాడు, ఖమ్మం జిల్లా