సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 12: సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్ (KCR Nagar) పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల పట్టణ వాసుల కోసం 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి, లబ్ధిదారులకు అందించారు. ఇక్కడ 110 బ్లాక్‌లలో 1320 డబుల్ బెడ్ రూమ్స్‌లో మొత్తం జనాభా సుమారు 6వేల వరకు ఉంటుంది. 1340 మంది ఓటర్లు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం గ్రామపంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగియంతో కేసీఆర్ నగర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఆందోళన చేశారు.
కలెక్టర్‌తో పాటు అధికార పార్టీ నేతలు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామన్నప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం గ్రామపంచాయతీ, జిల్లా మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో ఒక్కడి ప్రజలకు ఆశలు చిగురించాయి. తమ కేసీఆర్ నగర్ ప్రత్యేక గ్రామపంచాయతీగా ఆవిర్భావంతో పాటు పాలకవర్గం వస్తుందని ఆశపడ్డారు. పాలకవర్గం వస్తే సమస్యలు తామే పరిష్కరించుకోవచ్చని అనుకున్నారు. ఇటీవల అధికారులు సర్వే చేసినప్పటికి కేసీఆర్ నగర్‌పై ఎటూ తేల్చలేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఉంచుతారా..? లేదా ఏదైనా గ్రామపంచాయతీలో కలుపుతారా..? అనేది అధికారులు తేల్చలేదు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం అధికారులు పోలింగ్ కేంద్రాలు ఓటర్ జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కేసీఆర్ నగర్ లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా సిరిసిల్లకు 10 కిలోమీటర్ల ఉన్న కేసీఆర్ నగర్ వాసులు, సిరిసిల్ల ఉన్న తమ ఓట్లని కేసీఆర్ నగర్ మార్చుకున్నామని తెలిపారు. తీరా ఎన్నికల అధికారులు ప్రకటించిన జాబితాలో పోలింగ్ కేంద్రాలతో పాటు ఓటర్ జాబితా కూడా ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాము బతికున్నట్లా.. లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కెసిఆర్ నగర్ కాలనీ ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు లేనియెడల ఆందోళన చేస్తామని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై ఎంపీడీవో లక్ష్మీనారాయణ వివరణ కోరగా, కేసీఆర్ నగర్ ఓటర్ జాబితాను కలెక్టర్‌కు పంపించామని, కేసీఆర్ నగర్ ను ఇందిరమ్మ కాలనీలో కలుపుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్లు తెలిపారు.