Bhu Bharathi | హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): అనుభవదారు కాలమ్.. ఈ పేరు వింటేనే రైతుల్లో గుబులు మొదలవుతుంది. ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులకు కాస్తు కాలమ్ అని చెప్తే హడలిపోతుంటారు. అనుభవదారు పేరుతో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కి.. కొంతకాలానికి భూ యజమానిగా మారి రైతులను రోడ్డున పడేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. పట్టా భూములకే కాదు ప్రభుత్వ, దేవాదాయ భూములకూ ఈ అనుభవదారు కాలమ్ పెద్ద శాపంగా మారేది. 2020 కొత్త ఆర్వోఆర్ చట్టంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ అనుభవదారు కాలమ్‌ను ఎత్తేసింది. దీంతో గుండెలమీద కుంపటి తొలిగినంత పనైందని లక్షలాది మంది రైతులు సంతోషం వ్యక్తంచేశారు. ఆ ఆనందం నాలుగేండ్లు కూడా నిలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ‘భూ భారతి’ పేరుతో తీసుకొస్తున్న కొత్త చట్టంలో అనుభవదారు కాలమ్‌ను చేర్చింది. పైగా 2014 వరకు రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్న వారి పేర్లను చేర్చుతామని ప్రకటించింది. వారికి హక్కులు సైతం కల్పిస్తామని చెప్పింది. దీంతో రైతుల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.
కాస్తులోకి వచ్చి.. ఆస్తి కాజేసి..
గతంలో అనుభవదారు కాలమ్ వల్ల చాలా మంది రైతుల తలరాతలు తలకిందులయ్యాయి. కొందరు అక్రమార్కులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూములను గుంజుకొని అన్నదాతల జీవితాలను రోడ్డున పడేశారు. ముందుగా ప్రణాళిక ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్‌లో పేరు రాయించుకునేవారు. ఈ విషయం రైతులకు కూడా తెలిసేది కాదు. కొన్నేండ్లు అనుభవదారుగా కొనసాగిన తర్వాత పేరును పట్టాదారు కాలమ్‌లోకి మార్చి.. అసలు రైతు పేరును తొలిగించేవారు. ఈ విషయం కూడా రైతులకు తెలిసేది కాదు. రైతు అవసరానికి భూమిని అమ్మాలని భావించినప్పుడు ఈ విషయం బయటపడేది. దీంతో రైతులు తమ భూమిని ఇప్పించాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. కోర్టులకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఏండ్లపాటు రికార్డుల్లో అసలు రైతు స్థానంలో అక్రమార్కుల పేర్లే కనిపించడంతో సాంకేతికంగా అక్రమార్కులే పైచేయిగా నిలిచేవారు. ఫలితంగా రైతులు రోడ్డున పడేవారు. రైతులకు గొడవలు, ఘర్షణలు వంటివి నిత్యకృత్యం అయ్యేవి. దాడులు, ప్రతిదాడులు, పోలీస్స్టేషన్లు, కోర్టులు అంటూ ఏండ్లకేండ్లు వివాదాలు కొనసాగేవి.
సొంత భూమికి దూరమైన అన్నదమ్ములు
మంచిర్యాల జిల్లాలో ఓ రైతుకు 1953 నుంచి 7.16 ఎకరాల పట్టా భూమి ఉండేది. ఆయన మరణానంతరం ఇద్దరు కొడుకులు సమానంగా భూమిని పంచుకున్నారు. 1993లో అప్పటి వీఆర్వో లంచం తీసుకొని పహాణీలో ఆ భూమిని వేరే వ్యక్తికి రాసేశారు. దీంతో అన్నదమ్ములు దశాబ్దాలపాటు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. పరిశీలిస్తే అనుభవదారుగా ఉన్న వ్యక్తి పేరుమీదికే ఆ భూమి మారినట్టు తేలింది. ఇలా రైతులకు తెలియకుండానే మారిపోయిన స్థలాలు ఎన్నో ఉన్నాయి.
ప్రభుత్వ భూములకూ ఎసరు
అనుభవదారు కాలమ్‌తో రైతులకే కాదు ప్రభుత్వ భూములు, దేవుడి మాన్యాలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. ఆలయాల్లో పనిచేసినవారు, ధర్మకర్తల వంటివారు ఆలయాల మాన్యాల భూముల్లో అనుభవదారుగా చేరి, కొన్నేండ్ల తర్వాత పట్టాదారుగా రికార్డుల్లో మార్పించుకునేవారు. ఇలా వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని ఓ ప్రముఖ ఆలయానికి చుట్టూ ఉన్న వివిధ గ్రామాల్లో భూములు ఉన్నాయి. దేవుడి పేరుతోనే ఉన్న ఓ పూజారి కుటుంబం ముందుగా అనుభవదారు కాలమ్‌లో చేరింది. ఆ తర్వాత కొన్నేండ్లకు దేవుని పేరు తీసేసి, పట్టాదారు పేరులోకి తమ పేరును మార్చుకున్నది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి దేవాదాయ శాఖలోనే పనిచేయడంతో సులువుగా భూముల రికార్డులు మారిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములదీ ఇదే పరిస్థితి.
కాలగర్భంలోకి కాలమ్‌లు
‘ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే కౌలు పేరుతో పొలాన్ని కిరాయికి ఇస్తారు. కబ్జాదారు కాలమ్ పెట్టి కిరాయికి ఉన్న వ్యక్తికి ఇంటిపై హక్కులు ఇస్తామంటే ఒప్పుకుంటారా? మరి కౌలుకు తీసుకున్న వారికి భూమిపై హక్కులు ఎందుకు ఇవ్వాలి?’ అని కేసీఆర్ పదే పదే ప్రశ్నించేవారు. అందుకే 2020లో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అన్నిరకాల రికార్డుల స్థానంలో ఒకే ఒక ఆన్లైన్ రికార్డును అందుబాటులోకి తెచ్చారు. దీంతో అనుభవదారు/కౌలు కాలమ్ కాలగర్భంలో కలిసిపోయింది.
రైతునెత్తిన మళ్లీ పిడుగు
భూభారతి కొత్త చట్టంలో మళ్లీ అనుభవదారు కాలమ్ పెట్టి కాంగ్రెస్ సర్కారు రైతులపై పిడుగు వేసింది. కౌలుదారులకు మళ్లీ భూ హక్కులు కల్పిస్తామని స్పష్టం చేసింది. పైగా 2014కు ముందున్న అనుభవదారుల పేర్లను యథాతధంగా మళ్లీ తీసుకొస్తామని చెప్పింది. ఓవైపు వీఆర్వోలను తెస్తుండటం, మరోవైపు అనుభవదారులు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిరక్ష్యరాస్యులైన రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పొలంపై సంపూర్ణ హక్కులు ఉన్నాయన్న భరోసా ధరణి ఇస్తే.. భూ భారతితో కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రత కల్పిస్తున్నదని, కంటిమీద కునుకు లేకుండా ఇబ్బంది పెడుతున్నదని అన్నదాతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.