సభ దేని కోసం?
సంఘర్షణ ఎందుకోసం?
రాహుల్ రాక ఎవరి కోసం?
రైతు కోసమా? రైతు కోసమేనా?
నీతిగా, నికార్సుగా అదే నిజమైతే…
పేరుగొప్ప కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ
సంఘర్షణ పడాల్సిన ప్రదేశం వేరే..
అది కాంగ్రెస్ పాలనలోని
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్!
ఎందుకంటే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రైతన్నలు…
సాగునీరు దొరకక సంఘర్షణ పడుతున్నారు.
పెట్టుబడి సాయం లేక సంఘర్షణ పడుతున్నారు.
బీమా ధీమా అందక సంఘర్షణ పడుతున్నారు.
ఉచిత కరెంటు లేక సంఘర్షణ పడుతున్నారు.
ఉన్నదీ 6 గంటలైనా రాక సంఘర్షణ పడుతున్నారు.
బోర్లకు అనుమతి లేక సంఘర్షణ పడుతున్నారు.
కనీస మద్దతు ధర అందక సంఘర్షణ పడుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు లేక సంఘర్షణ పడుతున్నారు.
ఊపిరికీ, ఉరికీ మధ్య ఊగిసలాడే జీవితంగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రైతన్నలు సంఘర్షణ పడుతున్నారు. మొహరించిన ఆశకూ, మోసగించిన కాంగ్రెస్‌కూ మధ్య మొలకెత్తి వాడిన మొక్కలా ఆ రాష్ర్టాల రైతులు నలిగిపోయి సంఘర్షణ పడుతున్నారు. మడి కట్టు మీది వ్యవసాయం కట్ట మైసమ్మ జాతరలా పండుగైన తెలంగాణలో కాదు రాహుల్ సభ పెట్టాల్సింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో తన పార్టీ ప్రభుత్వాల నిర్వాకం చూసి సిగ్గుతో ఆయన సంఘర్షణ పడాలి.పవిత్ర గంగా జలం సాక్షిగా ప్రమాణం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఏండ్ల తరబడి ఆ పార్టీ ఏలుబడిలోనే ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ‘వ్యవసాయం- రైతన్న’ పరిస్థితిపై ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ స్టోరీ
రాహుల్‌గాంధీ కోసం ప్రత్యేకం!
కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట.. పరిపాలన చేయడం చేతకాక అన్ని రాష్ర్టాల్లో భంగపడి.. రెండు రాష్ర్టాలకే పరిమితమైన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో రైతులకు నీతులు చెప్పడానికి రావడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో ఓ పక్క వ్యవసాయం సస్యశ్యామలమై.. రైతులు అన్ని విధాలుగా సంపన్నం కాగా.. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో అరిగోస పడుతున్నారు. మూడు నాలుగు గంటలైనా కరెంటు రాక.. సాగునీరు అందక.. బోర్లు వేసుకొంటామంటే అనుమతులు రాక.. పండిన పంటను కొనేవాళ్లు లేక.. అమ్మినా గిట్టుబాటు దక్కక కనాకష్టం పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో, రాజస్థాన్‌లో రైతుల దీనస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్..
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఇక్కడి పాలకులు తాము స్వయంగా రైతుబిడ్డలమని చెప్పుకొంటారు. కానీ.. రైతుల గోడు మాత్రం పట్టదు. జనాభాలో అత్యధికులు ఆధారపడే వ్యవసాయాన్ని దాని ఖర్మాన వదిలేసి చోద్యం చూస్తుంటారు. దశాబ్దాల తరబడి ఒకే విధానాలు.. సాగులో మార్పు రాదు.. విస్తీర్ణం పెరుగదు.. పండిన పంటకు గిట్టుబాటు రాదు. ప్రభుత్వ పరంగా రైతులకోసం చేయాల్సిన ఒక్క పనీ చేయరు. దాదాపు మూడు కోట్ల హెక్టార్లలో సేద్యం చేసే రైతుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం అన్నదాతలను గాలికి వదిలేసింది. వ్యవసాయరంగానికి సంబంధించి సమగ్రమైన విధానమొకటి లేకపోవటం వల్ల రాజస్థాన్‌లో సాగు విస్తీర్ణం పెరుగలేదు. సాగునీరు లేదు.. ఉచిత విద్యుత్తు మాట దేవుడెరుగు.. ఇచ్చే విద్యుత్తు కూడా సరిగా ఇవ్వరు.. మూడున్నర గంటలపాటు కరెంటు వస్తే అదే గొప్ప. పైగా భారీగా బిల్లులు వసూలుచేస్తారు. ‘ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన’ ద్వారా ఓ రూ.వెయ్యి సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం కూడా నిరుడు మే నెలనుంచే మొదలైంది. ఇప్పటివరకు 3.38 లక్షల మంది రైతులకు విద్యుత్తు కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
రైతులు చనిపోతే.. వారి కుటుంబం అల్లాడిపోకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా అమలుచేస్తున్నది. ఏ కారణంగా చనిపోయినా.. వారం రోజుల్లో బీమా మొత్తం రైతు కుటుంబానికి చేరుతుంది. రాజస్థాన్ ప్రభుత్వం ఒక విచిత్రమైన బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అదేమిటంటే.. రైతు ప్రమాదంలో చనిపోతే వర్తిస్తుంది. అదికూడా వ్యవసాయ యంత్రాల కారణంగా ప్రమాదం జరిగి చనిపోతే.. 2 లక్షలు పరిహారం ఇస్తారు. దీనికీ సవాలక్ష కొర్రీలు పెడతారు.
రాజస్థాన్‌లో ప్రభుత్వ వివరాల ప్రకారం 2013-14లో 2.64 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉండగా 2019-20లో 2.78 కోట్ల హెక్టార్లుగా నమోదైంది. అంటే ఏడేండ్లలో రాజస్థాన్‌లో పెరిగిన విస్తీర్ణం 14 లక్షల హెక్టార్లు మాత్రమే. 2013-14లో వివిధ పంటలకు సంబంధించి 3.28 కోట్ల టన్నుల ఉత్పత్తి కాగా 2019-20లో అది 4.08 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే ఏడేండ్ల కాలంలో 80 లక్షల టన్నులు మాత్రమే పెరిగింది.
రాజస్థాన్ ప్రభుత్వం ఏ చిన్న కారణం దొరికినా.. రైతుల నెత్తిన టోపీ పెట్టడానికి క్షణం కూడా ఆలోచించదు. కరోనా సంక్షోభంలో దేశమంతా అల్లాడినప్పుడు రైతులకు ఇబ్బంది ఉండొద్దని తెలంగాణ ప్రభుత్వం గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొన్నది. రైతులకు మద్దతుధర దక్కేలా చూసింది. ఘనత వహించిన రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం పంటల కొనుగోలుపై చేతులెత్తేసింది. కొనుగోళ్లకు సంబంధించిన ఈ పోర్టల్‌ను మూసేసింది. దీంతో రైతులు తమ పంటలను బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కన్నా తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఆవాలకు మద్దతు ధర రూ.4,425 ఉంటే రూ.3,800లకే అమ్ముకున్నారు. పప్పు పంటలు రూ.4,875 ఉంటే రూ.4 వేలకు అమ్ముకొన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ అయోమయ వ్యవసాయ విధానాల వల్ల దౌసా అనే గ్రామంలో ఓ రైతుకు అప్పులిచ్చిన బ్యాంకు.. రుణం తిరిగి చెల్లించలేదని.. అతని భూములను వేలం వేసింది. రైతు చనిపోయిన రెండున్నర నెలల తరువాత అతను తీసుకొన్న రూ.7లక్షలు చెల్లించలేదని రూ.46 లక్షలకు వేలం వేసింది. ఆ రైతు కుటుంబం సమయం కోరినప్పటికీ ఒప్పుకోలేదు. చివరకు రైతులంతా వెళ్లి జైపూర్‌లో సీఎం ఇంటిముందు ధర్నా చేశారు. దీంతో రిమూవల్ ఆఫ్ డిఫికల్టీస్ యాక్ట్ కింద వేలం నిలుపుదలకు కలెక్టర్‌ను ఆదేశించారు. వేలాన్ని రద్దుచేసిన కలెక్టర్ ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించకపోగా.. రుణం చెల్లించడానికి బ్యాంకుతో సెటిల్మెంట్ చేయడం గమనార్హం.
వరంగల్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వాజేడు: తెలంగాణ కంటే దాదాపు 14 ఏండ్లకు ముందు ఛత్తీస్‌గఢ్ ఏర్పడింది. అక్కడ 70 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ.. మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఛత్తీస్‌గఢ్ గ్రామాల ప్రజలు మాత్రం తమను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తున్నారు. కారణం ఒక్కటే.. మన దగ్గర వ్యవసాయ విధానాలు, రైతు సంక్షేమపథకాలు తమకూ కావాలని! వ్యవసాయానికి అత్యంత ప్రధానమైన విద్యుత్తు, సాగునీరు లేకపోవడం ఛత్తీస్‌గఢ్ రైతులను తీవ్రంగా వేధిస్తున్న సమస్య. తెలంగాణలో రైతులకు 24 గంటలు, 365 రోజులు నిరంతరాయంగా విద్యుత్తు ఉచితంగా అందుతున్నది. సాగునీటి సమస్య లేనేలేదు. మిషన్ కాకతీయతో చెరువులు పరిపుష్టమయ్యాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో పుష్కలంగా నీరు అందుతున్నది. నీటి తీరువానూ తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఏడాది మొత్తం కచ్చితంగా సాగునీరు అందుతుందన్న గ్యారంటీ లేదు. పేరుకు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ.. రైతులు ఎక్కువగా వానలపైనే ఆధారపడాల్సిన అవసరం నెలకొన్నది. వానకాలం పంటకే నీళ్లు అందే పరిస్థితి లేదు.
ఇక విద్యుత్తు సరఫరా సంగతి సరే సరి.. ఇతర రాష్ర్టాలకు విద్యుత్తు విక్రయించే రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌కు పేరున్నది. కానీ సొంత రైతులకు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వం అమ్ముకొంటున్నది. రోజుకు 8 గంటలకు కరెంటు ఇస్తామని డాంబికాలు పోయే ప్రభుత్వం నాలుగు గంటలివ్వటమే గగనమైంది. ఇక తెలంగాణ మాదిరిగా ఉచిత విద్యుత్తు ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇక బిల్లుల మాట దారుణం. ఇంతకుముందు సాగునీరు ఇవ్వకపోయినా.. బోర్లు వేసుకోవడానికైనా అనుమతులు వచ్చేవి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఆ అనుమతులు కూడా ఇవ్వడం లేదు. దరఖాస్తు చేసుకొని ఆరు నెలలైనా అనుమతులు రావడం లేదు.
ఛత్తీస్‌గఢ్‌లోని 27 జిల్లాలను వ్యవసాయపరంగా మైదాన (15), పీఠభూమి (7), ఉత్తర (5) ప్రాంతాలుగా విభజించారు. మైదాన ప్రాంతంలోని రాయ్‌పూర్, గరియాబంద్, బలోదాబజార్, మహాసముంద్, ధంతరీ, దుర్గ్, బలోద్, బీమేతరా, రాజ్‌నందగాం, కబీర్‌ధాం, బిలాస్పూర్, మంగేళి, కోబ్రా, జంజీర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో 43 శాతానికి మించి సాగునీరు అందడంలేదు. ఇక పీఠభూమి వాసుల పరిస్థితి దయనీయం. జగదల్పూర్, నారాయణపూర్, బీజాపూర్, కొండగాం, దంతేవాడ, సుక్మా, కాంకేర్ జిల్లాలోని వ్యవసాయ భూములకు 5 శాతం సాగునీరు అందుతుంది. ఉత్తర ప్రాంతంలోని సర్గుజ, సూరజ్‌పూర్, బలరాంపూర్, కొరియా, జష్పూర్ జిల్లాల్లోని వ్యవసాయ భూములకు 11 శాతం సాగునీటి వసతి కల్పిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 32 శాతం భూమికి మాత్రమే సాగునీరు అందుతున్నది. దీంతో రైతులు ఇతర రాష్ర్టాలకు వలసపోతున్నారు. తలాపున గోదావరి పారుతున్నా వినియోగించుకొనే స్థితి లేదు. రైతులు ఆరుతడి పంటలు సాగుచేసే పరిస్థితి నెలకొన్నది. దాదాపు కోటిన్నర ఎకరాల సాగుయోగ్యమైన రాష్ట్రంలో ఛత్తీస్‌గఢ్ సర్కారు సాగునీటి కోసం బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు కేవలం రూ.3,324 కోట్లు. తెలంగాణలో వ్యవసాయానికి ఖర్చుచేస్తున్న నిధులు ఇంతకు కనీసం ఏడు రెట్లు అధికం. వీటన్నింటి నేపథ్యంలో ఏడాదికి ఒక పంట వేసుకోవడం మినహా ఛత్తీస్‌గఢ్ రైతులకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు పథకాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కాపీ కొట్టి తమ దగ్గరా అమలుచేయడం మొదలుపెట్టింది. ముందుగా వరి రైతులకు ఎకరానికి పదివేలు ఇచ్చారు. ఆ తరువాత మిగతా పంటలకు వర్తింపజేశారు. కానీ.. ఈ డబ్బులు కూడా అందరికీ అందడం లేదు. తెలంగాణలో పోడు వ్యవసాయం చేసుకొనే రైతులకు కూడా రైతుబంధు అందుతున్నది. కానీ.. ఛత్తీస్‌గఢ్‌లో ఈ పథకం పరిమితంగానే అందుతున్నది. అదికూడా దశలవారీగా ఇస్తుండటంతో ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణలో రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతుబీమా పథకం ప్రస్తావన కూడా ఈ రాష్ట్రంలో లేదు. తెలంగాణలో ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజ కొంటున్నది. ఇందుకోసం గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రైతు తాను పండించిన పంటను మార్కెట్‌యార్డులకు తానే రవాణా ఖర్చులు భరించి తీసుకొని పోవాలి. అక్కడిదాకా వెళ్తే.. ఎకరానికి 15 క్వింటాళ్లు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తుంది. మిగతా ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిందే. మద్దతు ధరకంటే ఎక్కువిచ్చి కొంటామని చెప్తారు. కానీ.. కొన్న డబ్బులను మూడు విడుతలుగా తోచినప్పుడు వేస్తారు. మొత్తం డబ్బులు వచ్చేలోగా మరో పంట కోతకు వస్తుందని రైతులు వాపోతున్నారు. కల్తీ విత్తనాలు, యూరియా బ్లాక్‌మార్కెటింగ్‌ను అడ్డుకొనేవారే లేరు. రూ.280-రూ.350 కి అందాల్సిన యూరియాను రూ.600 కు పైగా పెట్టి కొనాల్సి వస్తున్నది. ఇక రైతు వేదికలు, కల్లాల ఆలోచన సైతం అక్కడి ప్రభుత్వానికి, పాలకుల మస్తిష్కాలకు రానే లేదు.
మా రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు ఇవ్వడంలేదు. తెలంగాణలో ఎకరానికి ఏటా రూ.10 వేలు రైతుబంధు కింద ఇస్తున్నరు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించారు. 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తున్నరు. కానీ మా దగ్గర ఇంద్రావతి నది 215 కిలోమీర్లు ప్రవహిస్తున్నా ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. నీళ్లు, కరెంటు లేక మేము అనేక కష్టాలు పడుతున్నం. – సుధాకర్, భూపాలపట్నం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్
రాజస్థాన్‌లో రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. సమయానికి డీఏపీ దొరకదు, యూరియా దొరకదు. సమయానికి కరెంటు రాదు. 6 అంటున్నారు. కానీ 3, 4 గంటలు మాత్రమే ఉంటది. అది కూడా అనేకసార్లు పోయి వస్తది. ఒక్కసారి రాదు. ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లో రుణ మాఫీ అన్నరు. రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కానీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేండ్లు అయ్యింది. ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. తప్పుడు హామీలు ఇచ్చే రాహుల్‌గాంధీ మాటలు నమ్మొద్దు.
– హరీశ్‌కుమార్, రైతు, అల్వార్ జిల్లా, రాజస్థాన్
మా తాన రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. నీళ్లు లేవు, కరెంటు లేదు. కరెంటు వచ్చినా నీళ్లు తగ్గిపోతున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, నాలుగేండ్లయినా రుపాయి కూడా మాఫీ చేయలేదు.
– హరీశ్‌సింగ్, రైతు, అల్వార్ జిల్లా, రాజస్థాన్
మా దగ్గర పంటలు పండించినా ధరలు ఉండవు. దూరంపోయి అమ్ముకోవాలంటే ఖర్చవుతున్నది. పప్పులు పండించి ఏటూరునాగారం, వరంగల్‌కు పోయి అమ్ముకుంటం. తెలంగాణ నుంచి మా దగ్గరికి వ్యాపారులు వచ్చి కొంటరు. మా దగ్గర సర్కారు కొనదు.
– బజ్జూరి రాజన్న, తాళ్లగూడెం, భూపాలపట్నం తాలుకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్
వడ్లను అమ్ముకోవాలంటే చానా కష్టం. దగ్గర్ల కొనుడు లేదు. సర్కారు మార్కెట్లకు పోతనే కొంటరు. ఇక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరం పోతే భూపాలపట్నం మార్కెట్ల కొంటరు. ఖర్చులు బాగా అయితయి.
– వాసం లక్ష్మణ్, తాళ్లగూడెం,
భూపాలపట్నం తాలుకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్
సర్కారు నుంచి మా దగ్గరికి ఎవలూ వచ్చి ఏమీ చెప్పరు. మా ఇష్టం ఉన్న పంటలు ఏస్తం. అమ్ముకునుడు మా ఇష్టమే. సర్కారు వాళ్లు వచ్చి పంటలను చూసుడు చేయరు. తెలంగాణలో లెక్క ఇక్కడ రైతు వేదికలు వంటివి లేవు.
– మాదె లక్ష్మయ్య, తాళ్లగూడెం, భూపాలపట్నం తాలుకా, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్