తెలంగాణ.. ఆకాశమంత ఆత్మగౌరవాన్ని కలిగిన నేల. ఉద్యమకాలం నుంచీ.. నిర్బంధాలను దాటుకుంటూనే అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన నేల. ఆ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చేతనను పత్రిక ఆవిర్భావం నుంచీ కనిపెట్టుకుంటూ వస్తున్నది నమస్తే తెలంగాణ. ప్రశాంతంగా బతికిన పల్లెల్లో మళ్లీ ఇప్పుడు ముళ్ల కంచెలు మొలుస్తున్నాయి. నిర్బంధాల విచ్చుకత్తులు విచ్చుకుంటున్నాయి. పరాయితనం ప్రవేశించిన పాలకులు.. సొంత అస్తిత్వానికి గోతులు తీస్తున్నారు. ఉద్యమ చిహ్నాలను చిదిమేస్తున్నారు. ఆంధ్రా పలుకుబడికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నింటినీ ఎక్కడికక్కడ కథనాల ద్వారా ప్రశ్నించింది నమస్తే తెలంగాణ. పాలకుల వివక్షను ఎప్పటికప్పుడూప్రజలకు నివేదించింది.
ముళ్లకంచెలు, నిర్బంధాలు
రాజ్యాంగ పరిరక్షణ.. ప్రజలకు నిరసన తెలిపే హక్కును కాపాడటం ఏడో హామీ అని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చీరాగానే ఎక్కడికక్కడ ఆందోళనలపై ఉక్కుపాదం మోపేందుకు ముళ్లకంచెలు వేసింది. ప్రగతి భవన్ వద్ద కంచెను తొలగిస్తామంటూనే ప్రజాభవన్‌గా పేరు మార్చి ‘హద్దు’గోడలు కట్టింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చివరికి పోలీసులు కూడా తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కితే వారి గొంతును నొక్కేందుకు ఎక్కడికక్కడ నిర్బంధం విధించిన సర్కార్ విధానాన్ని ‘నమస్తే తెలంగాణ’ నిగ్గదీసి అడిగింది.
ఆర్థికం.. ఆగమాగం
రెండేండ్లుగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆగమవుతున్న తీరుపై నమస్తే తెలంగాణ విశ్లేషణాత్మక కథనాలను అదిం చింది. జీఎస్టీ వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం.. చిట్ట చివరి స్థానానికి ఎలా పడిపోయిందో, కరోనా కాలాన్ని దాటి కాంగ్రెస్ పాలనలో మైనస్ వృద్ధిరేటు ఎలా నమోదైం దో.. కనీవినీ ఎరుగనిస్థాయిలో నెగెటివ్ ద్రవ్యోల్బణం (డీఫ్లేషన్) ఎం దుకు వచ్చిందో ఎప్పటికప్పుడు వివరించింది. రాష్ట్ర రెవెన్యూ రాబడి ఆందోళనకరస్థాయికి పడిపోతున్న తీరుపై, తలసరి వృద్ధిరేటు నేలచూ పులు చూస్తుండటంపై వరుస కథనాలతో ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
తల్లిని మార్చి.. అగౌరవపరిచి..
ఉద్యమంలో తేజోమూర్తిగా వెలిగి, ఊరూరా విగ్రహమై విరాజిల్లిన తెలంగాణ తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది. వైభవోపేత చరిత్రకు గుర్తుగా ఉన్న తల్లి విగ్రహాన్ని.. సాదాసీదాగా మార్చింది. చేతిలో బతుకమ్మను మాయం చేసింది. సోనియాగాంధీ బర్త్‌డే రోజున ఆవిష్కరించి, ‘కాంగ్రెస్ తల్లి’ అన్నట్టుగానే ట్రీట్ చేసింది. పోనీ, ఆ విగ్రహానికైనా గౌరవించిందా అంటే అదీ లేదు. గ్లోబల్ సమ్మిట్ అవశేషాల మధ్య అనామకంగా విగ్రహాన్ని పారేసింది. సర్కారు ద్వంద్వవైఖరిని ఫొటోలు సహా ప్రజలముందు ఉంచింది నమస్తే తెలంగాణ.
తరలివెళ్లిన పరిశ్రమలు
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రం నుంచి పలు పరిశ్రమలు తరలివెళ్లిపోయాయి. సెమీకండక్టర్ల కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కంపెనీతోపాటు ఔట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(ఓఎస్ఏటీ)కి సంబంధించిన దిగ్గజ సంస్థ కేన్స్ సెమికాన్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా ముఖం చాటేశాయి. కేన్స్ సెమికాన్ గుజరాత్‌కు వెళ్లగా, కార్నింగ్ ఇంటర్నేషనల్ తమిళనాడుకు మకాం మార్చింది. తెరవెనుక ఏం జరిగిందో, రాజకీయ వేధింపులు ఎలా నడిచాయో నమస్తే తెలంగాణ ప్రజల ముందు ఉంచింది.

భారీ అంబేద్కర్ విగ్రహానికీ తాళం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితగౌరవాన్నిచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున బాబా సాహెబ్ 175 అడుగుల భారీ బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విగ్రహ దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించింది. కేసీఆర్ ఏర్పాటు చేసిన విగ్రహం కాబట్టి దాన్ని ముట్టుకోకుండా గేట్లకు తాళాలు వేసి రేవంత్ సర్కారు చూపిన వివక్షను ‘నమస్తే తెలంగాణ’ ఎండగట్టింది.
కేసీఆర్‌పై కక్షతో సంక్షేమ పథకాల రద్దు
ఉద్యమ రోజుల్లో ప్రజల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అటకెక్కించిన తీరును నమస్తే తెలంగాణ ఎండగట్టింది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. బాలింతలకు కేసీఆర్ కిట్‌ను ఆపేయడం..పలు సీజన్లలో రైతుభరోసా అందివ్వకుండా రైతులకు ఎగనామం పెట్టడం, దళితబంధు, బీసీ బంధు, కంటివెలుగు లాంటి పథకాలను బంద్ పెట్టడంపై ‘అక్షర’ పోరు సాగించింది.
గ్యారెంటీల మోసంపై గళం
ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్క ఫ్రీ బస్సు మినహా మిగతా గ్యారెంటీలేవీ అమలు చేయకపోవడంపై ‘నమస్తే తెలంగాణ’ గొంతెత్తి అడిగింది. అవ్వాతాతలకు ఇస్తామన్న రూ.4వేల పింఛను, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు ఇస్తామన్న ఆర్థిక సాయం, ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ.2,500, విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు, నిరుద్యోగులకు ఇస్తామన్న ఏటా రెండు లక్షల కొలువులు ఏవని రెండేండ్లుగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నది.
ఆంధ్రా అధికారులకు అందలం
పదేండ్లు తెలంగాణ స్పృహతో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పోంగనే.. ఆంధ్రా అధికారులను అందలం ఎక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడి బిడ్డలను దూరంపెట్టి, ఆంధ్రా వ్యక్తులకు ఉన్నతపదవులిచ్చింది. ఫక్తు తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబుకు దాసుడైన ఆదిత్యానాథ్ దాస్‌ను నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించుకున్నది. ఆయన చెప్పినట్టల్లా ఆడుతూ తెలంగాణ నీటిహక్కులకు విఘాతం కలిగించే చర్యలకు సర్కార్ పూనుకున్నది. ప్రభుత్వ సలహాదారులుగా శ్రీనివాసరాజు, శ్రీరాం కర్రి తదితరులను పెట్టుకున్నది. విద్యుత్తు సంస్థల సీఈఐజీ నందకుమార్, జెన్కో డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, ఎస్వీ కుమార్‌రాజా, రెడ్కో వీసీ అండ్ ఎండీగా అనీల.. అలా సుమారు 40 మంది వరకు ఆంధ్రా ప్రముఖులకు ఉన్నతాసనాలు వేసింది. తెలంగాణ హక్కులను ఆంధ్రా అధికారుల చేతిలో ఆటవస్తువులుగా మార్చిన సర్కార్ తీరుపై నమస్తే తెలంగాణ ఎప్పటికప్పుడు కలం ఝులిపించింది.
ప్రముఖులకు అవమానం
ఉద్యమకారులు, ఇక్కడి మట్టి బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు అవమానాలకు గురిచేసింది. కిన్నెరమెట్ల మొగులయ్య చిత్రపటంపై పోస్టర్లు వేయడం మీద స్వయంగా ఆయనే పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. పద్మశ్రీ మొగులయ్యే చివరికి బకెట్‌తో నీళ్లు తెచ్చుకుని శుభ్రపర్చుకోవాల్సిన దయనీయస్థితిని ప్రజలముందు ఉంచింది నమస్తే తెలంగాణ. ఇక ప్రజానేత, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకూ సీఎంవోలో అవమానమే ఎదురైంది. ఆయన ఎన్నిసార్లు వచ్చినా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కాన్వాయ్ పోతుంటే, రోడ్డుపక్కన వినతిపత్రం పట్టుకుని నిలబడినా, పట్టించుకున్నవారు లేరు. ఆ ఉదంతాన్నీ వెలుగులోకి తెచ్చింది నమస్తే తెలంగాణ.