రామగిరి, ఏప్రిల్ 7: వాహన ప్రియులు షోరూంలకు వెళ్లకుండా.. నచ్చిన కంపెనీ వాహనాలను కొనుగోలు చేసేలా.. వివిధ రకాల కంపెనీల వాహనాలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచుతూ ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహించిన మెగా ఆటో షో ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఒకే దగ్గర అన్ని రకాల కంపెనీల వాహనాలను ప్రదర్శించడం వాహన ప్రియులకు మంచి అవకాశమని తెలిపారు. ఓ వైపు సమాజంలోని మంచి, చెడులపై సంచలనాత్మకమైన వార్తలను రాసి ప్రజలను చైతన్యం చేస్తూనే.. మరోవైపు వాహన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఆటో షోలు ఏర్పాటు చేయడం హర్షణీయమని చెప్పారు.
వాహనాలు తీసుకున్న వారికి తక్షణం రుణం అందించేలా బ్యాంకులు, పైనాన్స్ సంస్థలను అందుబాటులో ఉంచడం సంతోషకరమని వివరించారు. నల్లగొండ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో రెండోసారి ఆటో షో నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మెగా ఆటో షో చివరి రోజున సందర్శకులు భారీ సంఖ్యలో పాల్గొని తమకు నచ్చిన పలు సంస్థల కార్లు, బైక్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక, సంప్రదాయ, జానపద నృత్యాలు అలరించాయి.
‘నమస్తేతెలంగాణ’ తరఫున స్టాల్స్ నిర్వాహకులకు ప్రత్యేక బహుమతులను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి చేతులమీదుగా అందజేశారు. పవన్ మోటర్స్, జావా ఎస్డీ బైక్స్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, నమస్తేతెలంగాణ బ్రాంచ్ మేనేజర్ టీ మహేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, ఏడీవీటీ మేనేజర్ కే శివకుమార్, వివిధ విభాగాల ఇన్చార్జిలు, సిబ్బంది పాల్గొన్నారు.